పోషక యాజమాన్యంతో సత్ఫలితాలు

27 Jun, 2017 22:30 IST|Sakshi
పోషక యాజమాన్యంతో సత్ఫలితాలు

- మెలకువలు పాటిస్తే టమాటా, మిరపలో మేలైన దిగుబడి
- సేంద్రియ, రసాయనాలతో పాటు ఫర్టిగేషన్‌ ఇవ్వాలి
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌ : టమాట, మిరపలో సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడి రావడం లేదని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. దుక్కిలో వేయడంతో పాటు డ్రిప్‌ ద్వారా ఫర్టిగేషన్‌ పద్ధతిలో సకాలంలో సరైన మోతాదులో ఎరువులు అందిస్తే పంట దిగుబడులకు డోకా ఉండదన్నారు.

టమాటా :
    చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటే సమయంలో ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్‌ పాస్ఫేట్‌), 24 కిలోలు పొటాష్‌ (40 కిలోల మ్యూరేట్‌ ఆప్‌ పొటాష్‌) ఎరువు వేయాలి. 48 నుంచి 60 కిలోల నత్రజని ఎరువును మూడు సమపాళ్లుగా చేసి నాటిన 30, 45, 60 రోజుల సమయంలో పైపాటుగా వేసుకొని బోదెలను ఎగదోయాలి. పూత దశలో 20 గ్రాములు యూరియా లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే 15 నుంచి 20 శాతం దిగుబడి పెరుగుతుంది.  నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోలు చొప్పున బోరాక్స్‌ వేస్తే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరాకు 10 కిలోల చొప్పున జింక్‌ సల్ఫేట్‌ వేస్తే జింకు లోపం ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. నాటిన తర్వాత 30, 45 రోజుల సమయంలో 2 గ్రాములు జింక్‌ సల్ఫేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత దశలో ఎకరాకు ఎకరాకు 400 గ్రాములు 2,4–డీ మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్‌ నాలుగు లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పూత, పిందె రాలకుండా కాపాడుకోవచ్చు.

ఫర్టిగేషన్‌ పద్ధతిలో ఎరువులు :
    టమాటా నాటిన 15 నుంచి 40 రోజుల వరకు ఒక కిలో 19–19–19 + ఒక కిలో యూరియా + 500 గ్రాములు 12–61–0 ఎరువులు ఫర్టిగేషన్‌ పద్ధతిలో అందజేయాలి. 45 రోజుల నుంచి 70 రోజుల వరకు 250 గ్రాములు 13–0–45 + ఒక కిలో తెల్ల పొటాష్‌ + 50 గ్రాములు రిక్సోలీన్‌ ఎరువులు ఇవ్వాలి. 70 రోజుల నుంచి పంట కోత వరకు 750 గ్రాములు 13–0–45 + 500 గ్రాములు 0–0–50 + ఒక కిలో కాల్షియంనైట్రేట్‌ ఎరువులు డ్రిప్‌ ద్వారా అందించాలి. వీటితో పాటు పంట నాటిన తర్వాత నుంచి పంట కోత వరకు పైన తెలిపిన ఎరువులతోపాటు 500 గ్రాములు బోరాన్, 500 గ్రాములు జింక్‌ చిలామిన్‌ + 2.5 కిలోలు మెగ్నీషియం సల్ఫేట్‌ లాంటి సూక్ష్మపోషకాలు అందజేయాలి.

మిరప :
    ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. హెక్టారుకు వర్షాధార పైరుకు 60 కిలోలు నత్రజని, 40 కిలోలు భాస్వరం, 50 కిలోలు పొటాష్‌ ఎరువులు వేయాలి. ఆరుతడి పంటల పైరుకు హెక్టారుకు 300 కిలోలు నత్రజని, 60 కిలోలు భాస్వరం, 120 కిలోలు పొటాష్‌ ఎరువు వేయాలి. ఫర్టిగేషన్‌ పద్ధతి ద్వారా నాటిన 15వ రోజు నుంచి 45వ రోజు వరకు అర కిలో వైట్‌ పొటాష్‌ + ఒక కిలో యూరియా + 500 గ్రాములు సీఎన్‌ ఇవ్వాలి. 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఒక కిలో 19–19–19 + 500 గ్రాములు 12–61–0 ఎరువులు వేయాలి. 90 రోజుల నుంచి 150 రోజుల వరకు ఒక కిలో 13–0–45 + అర కిలో యూరియా + అర కిలో అమ్మోనియం సల్ఫేట్‌ అందజేయాలి. 150 రోజుల నుంచి 210 రోజుల వరకు 1.5 కిలోలు యూరియా + అర కిలో 13–0–45 + అర కిలో 0–0–50 + ఒక కిలో సీఎన్‌ ఎరువులు డ్రిప్‌ ద్వారా అందజేయాలి.

మరిన్ని వార్తలు