సీడ్‌లెస్‌ ద్రాక్షతో లాభాలు

19 Jul, 2017 22:13 IST|Sakshi
సీడ్‌లెస్‌ ద్రాక్షతో లాభాలు

అనంతపురం అగ్రికల్చర్‌ : పొడివాతావరణం కలిగిన అనంతపురం జిల్లా ద్రాక్ష తోటలకు అందులోనూ సీడ్‌లెస్‌ రకం సాగుకు అనువైన ప్రాంతమని ఉద్యానశాఖ టెక్నికల్‌ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్‌   తెలిపారు. నీటి ఎద్దడిని తట్టుకునే రూట్‌స్టాక్‌ రకం ద్రాక్ష అందుబాటులోకి వచ్చినందున కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. ద్రాక్ష సాగులో చేపట్టాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

సస్యరక్షణ యాజమాన్యం :
ద్రాక్ష తోటలకు సాధారణంగా బూడిద తెగులు, ఆల్టర్నేరియా మచ్చతెగులు, రసంపీల్చు పురుగులైన త్రిప్స్, మైట్స్‌ (నల్లి), మిల్లీబగ్‌ లాంటి చీడపీడలు సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చీడపీడలను సకాలంలో గుర్తించి తప్పనిసరిగా నివారణ  చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బూడిద తెగులు నివారణకు 0.5 గ్రాములు మైక్రోబుటానిల్‌ లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. అల్టర్నేరియా, ఈతమచ్చ తెగుళ్లు నివారణకు ఒక గ్రాముల రోకో (థయోప్సొనేట్‌ మిథైల్‌) ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బూడిదతెగులు, ఎర్రనల్లి నివారణకు 1.5 గ్రాములు వెట్టబుల్‌సల్ఫర్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. మిల్లీబగ్‌ నివారణకు 1 మి.లీ డైక్లోరోవాస్‌ లేదా 1.5 మి.లీ అప్లాడ్‌ (బూప్రొఫిజెన్‌) ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పోషక యాజమాన్యం
అనుభవం కలిగిన వారితో కత్తిరింపులు జాగ్రత్తగా చేయాలి. కత్తిరింపులు చేసిన 70–75 రోజుల సమయంలో సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎస్‌వోపీ) ఎకరాకు 100 కిలోలు వేయాలి. కత్తిరింపులు అయిన 100–105 రోజుల సమయంలో ఎస్‌వోపీ ఎకరాకు 50 కిలోలు వేయాలి. డ్రిప్‌ ద్వారా 71–100 రోజు వరకు ప్రతి రోజూ  అర కిలో 13:0:45, ఒక కిలో 0:0:50 ఎకరాకు వేయాలి. 111–113వ రోజు వరకు ప్రతి రోజూ ఎకరాకు 0:0:50 ఒక కిలో వేయాలి.

మరిన్ని వార్తలు