రోగరహిత నార్లతోనే దిగుబడి

26 Jul, 2017 22:39 IST|Sakshi
రోగరహిత నార్లతోనే దిగుబడి

-  కూరగాయల సాగులో సమగ్ర సస్య రక్షణ అవసరం
– ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.శ్రీనివాసులు

అనంతపురం అగ్రికల్చర్‌ : కూరగాయల పంటల ద్వారా మంచి దిగుబడులు సాధించాలంటే నర్సరీ నుంచి నాణ్యమైన రోగరహిత నార్లు ఎంపిక చేసుకోవాలని రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి. శ్రీనివాసులు తెలిపారు. చీడపీడలు, తెగుళ్ల సమస్య బాగా తగ్గాలంటే టమోటా, బెండ, వంగ, మిరప లాంటి కూరగాయల పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు.

ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట వద్దు
ఎకరాలకు ఎకరాలు ఒకేసారి ఒకేపంట వేసుకోవడం అంత మంచిదికాదు. కొన్ని రోజులు విరామం ఇచ్చి విడతల వారీగా నాటుకుంటే మార్కెటింగ్‌ సమస్య ఉండదు. ఏదో ఒక పంటకు మంచి ధర లభించి లాభదాయకంగా మారుతుంది. నర్సరీల నుంచి కూరగాయల మొక్కలు నాటుకోవాలనుకునే రైతులు, వారం రోజులు ముందుగా నర్సరీలోనే 2 మి.లీ రీజెంట్‌ (పిప్రోనిల్‌)+ 1 గ్రాము బావిస్టన్‌ లీటర్‌ నీటికి కలిపి నారుపై పిచికారి చేసుకుంటే రోగరహిత మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నర్సరీ నిర్వాహకులు కూడా కొన్ని నిబంధనలు పాటిస్తే రైతులకు మంచి మొక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పాలిథీన్‌ సంచుల్లో కార్భోఫ్యూరాన్‌ గుళికలు వేసి మొక్కలను పెంచాలి. అలాగే వైరస్‌ తెగుళ్ల నివారణకు 15 నుంచి 25 రోజుల సమయంలో రోగార్‌ లేదా మెటాస్టిటాక్స్‌ లేదా పిప్రొనిల్‌ 2 మి.లీ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.   

పోషక యాజమాన్యం :
ఎంపిక చేసుకున్న కూరగాయలు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ఎకరాకు 6 నుంచి 7 కిలోలు కార్భోఫ్యూరాన్‌ గుళికలు వేసుకోవాలి. దుక్కిలో ఎకరాకు 200 కిలోలు వేపపిండి, 80 కిలోలు యూరియా, 160 కిలోలు సింగిల్‌ సూపర్‌ఫాస్పేట్, 50 కిలోలు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ) ఎరువులు వేయాలి. నాటిన 25, 50, 75, 90 రోజుల సమయంలో సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. దిగుబడులు, నాణ్యత పెరగాలంటే 19–19–19 లేదా 13–0–45 మందులు 10 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పైపాటుగా పిచికారి చేసుకోవాలి. సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్‌) లోప నివారణకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. తగిన మోతాదులో రసాయన ఎరువులు వాడుతూనే ఎకరాకు నాలుగైదు టన్నులు పశువుల ఎరువు, ట్రైకోడెర్మావిరిడీ, పొటాష్, భాస్వరం ఎరువులు వేపపిండితో కలిపి వేసుకుంటే మేలు.

సస్యరక్షణ :
కూరగాయల పంటల్లో పూత, పిందె రాలడంతో దిగుబడులు తగ్గిపోతాయి. నివారణకు 2 మి.లీ ప్లానోఫిక్స్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.  వేరుకుళ్లు, మొదలుకుళ్లు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా కాపర్‌ హైడ్రాక్సైడ్‌ లేదా రిడోమిల్‌–ఎంజెడ్‌ 3 గ్రాములు ఒక లీటర్‌ నీటికి కలిపి మొదళ్ల దగ్గర పాదులు తడిచేలా పోయాలి.  కాయతొలచు పురుగు నివారణకు ఎన్‌పీవీ ద్రావణంతో పిచికారి చేయడం లేదా విషపు ఎరలు ఏర్పాటు చేయడం, పొలం చుట్టూ జొన్న, మొక్కజొన్న పంటలు నాలుగు సాళ్లు వేయడం, అక్కడక్కడ బంతిపూల చెట్లు నాటుకోవడం, వేపగింజల కషాయాన్ని పిచికారి చేయడం లాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే కూరగాయల పంటలు లాభదాయకం.

మరిన్ని వార్తలు