సస్యరక్షణతోనే లాభాలు

11 Aug, 2017 21:44 IST|Sakshi
సస్యరక్షణతోనే లాభాలు

- పత్తిపంటలో గులాబీపురుగు నివారణ చాలా ముఖ్యం
– ‘నంద్యాల’ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వై.రామారెడ్డి

అనంతపురం అగ్రికల్చర్‌: ప్రమాదకరమైన గులాబీరంగు కాయతొలచు పురుగు (పింక్‌బౌల్‌వార్మ్‌) నివారణతో పత్తి పంట లాభదాయకంగా ఉంటుందని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వై.రామారెడ్డి తెలిపారు. ఈ పురుగు వల్ల 2015లో పత్తి పంట దారుణంగా దెబ్బతినడంతో రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ క్రమంలో పురుగు ఉనికి ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలతో సమూలంగా నివారించుకోవాలని సూచించారు.

కనిపిస్తున్న గులాబీ పురుగు
ఈ ఏడాది పత్తి సాగు చేసిన పెద్దవడుగూరు, పామిడి, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో గులాబీ పురుగు ఉనికి కనిపిస్తోంది. అది ఉధృతి కాకుండా రైతులు సామూహిక చర్యలు చేపడితే సమూలంగా దాన్ని నివారించుకోవచ్చు. రైతులందరూ తమ పొలాల్లో ఎకరాకు నాలుగైదు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని ఉనికిని బట్టి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి. పొలంలో తిరిగి ఎక్కడైనా గుడ్డిపూలు, పురుగులు లేదా కింద రాలిపడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి. ఏ మాత్రం అజాగ్రత్త చేసినా పంటను దారుణంగా దెబ్బతీస్తుంది. మొదట్లోనే నివారించుకుంటే నష్టాన్ని బాగా తగ్గించుకోవచ్చు. తొలిదశలో 5 మి.లీ వేపనూనే లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆ తర్వాత ఉధృతిని బట్టి 1.5 గ్రాములు థయోడికార్బ్‌ లేదా 2 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్‌ లేదా 2 మి.లీ ప్రొఫినోపాస్‌ లాంటి మందులు లీటర్‌ నీటికి కలిపి మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకుంటే నివారించుకోవచ్చు.

పోషకాలు అవసరం
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రత్తి పంట 20 నుంచి 60 రోజుల దశ వరకు ఉంది. అటు ఎర్రనేలలు, ఇటు నల్లరేగడి నేలల్లో పంటను వేశారు. వర్షపాతాన్ని బట్టి ఒక అడుగు నుంచి మూడు అడుగుల ఎత్తులో పైరు ఉంది. ఇటీవల వర్షం పడటంతో అన్ని ప్రాంతాల్లో తగినంత తేమ ఉంది. ఎకరాకు 20 నుంచి 25 కిలోలు యూరియా, 15 నుంచి 20 కిలోలు పొటాష్‌ ఎరువులు వేసుకుంటే పంట దిగుబడులు పెరుగుతాయి.

>
మరిన్ని వార్తలు