మిరపలో ‘సెప్టెంబర్‌’ యాజమాన్యం

8 Sep, 2017 22:42 IST|Sakshi
మిరపలో ‘సెప్టెంబర్‌’ యాజమాన్యం

అనంతపురం అగ్రికల్చర్‌: ఇటీవల కురుస్తున్న వర్షాలకు మిరప తోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ, పోషకాలకు సంబంధించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త డాక్టర్‌ లక్ష్మిదుర్గ తెలిపారు.

మిరపలో సమగ్ర సస్యరక్షణ ఇలా :
జూలైలో విత్తిన మిరప నారును ప్రస్తుతం నాటుకోవచ్చు.  జూలైలో నాటిన మిరప తోటలకు ఎకరాకు 65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ) వేసుకోవాలి. కలుపు లేకుండా గొర్రు, గుంటకతో అంతరకృషి చేయాలి. ఆగస్టులో నాటుకున్న పంటకు తామర పురుగులు లేదా పైముడుత నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా 2 మి.లీ పిప్రొనిల్‌ లేదా 0.2 మి.లీ స్పైనోసాడ్, 1.25 గ్రాములు డైపెంథియురాన్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లి లేదా కిందిముడుత నివారణకు 5 మి.లీ డైకోఫాల్‌ లేదా 0.3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ స్పైరోమెసిఫిన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరపకు ఆశించిన పేనుబంక నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా 0.3 మి.లీ ఇమిడిక్లోప్రిడ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ ఎలా నివారించుకోవచ్చంటే :
తెల్లదోమ నివారణకు 1.25 మి.లీ ట్రైజోఫాస్‌ లేదా 1 మి.లీ స్పైరోమెసిఫిన్‌ లేదా 0.3 గ్రాములు అసిటమాప్రిడ్‌ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్‌ లేదా 1.25 గ్రాములు డైఫెంథియురాన్‌ లేదా 3 మి.లీ వేపనూనె (10,000 పీపీఎం) లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగు నివారణ ఇలా:
కాయతొలుచు పురుగు నివారణకు 1.5 గ్రాము అసిఫేట్‌ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్‌ లేదా 1 గ్రాము థయోడికార్బ్‌ లేదా 0.75 మి.లీ నొవాల్యురాన్‌ లేదా 0.3 మి.లీ క్లొరాన్‌ట్రనిప్రోల్‌ లేదా 0.3 మి.లీ ఫ్లూబెండమైడ్‌ లేదా 0.5 మి.లీ ఇమామెక్టిన్‌బెంజుయేట్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సెర్కొస్పోరా ఆకుమచ్చ తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు 2.5 గ్రాములు మాంకోజెబ్‌ + 2.5 గ్రాములు కార్బండిజమ్‌ లేదంటే 30 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ + 1 గ్రాము స్ట్రెప్టోసైక్లీన్‌ 10 లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు