‘గాలికుంటు’తో జాగ్రత్త

7 Sep, 2017 21:18 IST|Sakshi
‘గాలికుంటు’తో జాగ్రత్త

గుర్తించకపోతే పశువుల ప్రాణాలకే ప్రమాదం
ఈ నెల 20 వరకూ ఉచిత టీకాల కార్యక్రమం
పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ సన్యాసిరావు


అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాకాలంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులంతా అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) డాక్టర్‌ బి.సన్యాసిరావు తెలిపారు.  పశువులు, ఎద్దులకు గాలికుంటు వ్యాధి (ఫూట్‌ అండ్‌ మౌత్‌ డీసీజెస్‌) సోకకుండా ముందస్తుగా వేస్తున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. గాలింకుంటు వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్న సీజన్‌ కావడంతో ముందస్తుగానే జిల్లా అంతటా సెప్టెంబర్‌ 20న టీకాల కార్యక్రమం ప్రారంభించామనీ, ఈనెల 20వ తేదీ వరకు కొనసాగిస్తామని తెలిపారు. గడువులోగా రైతులు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.

వ్యాధి లక్షణాలు
గాలికుంటు వ్యాధి వల్ల పశువుల్లో మరణాలు తక్కువే అయినా... పాల ఉత్పత్తులు బాగా తగ్గిపోతాయి. ఏఓటీ, ఆసియా–1, ఆసియా–22, ఆసియా–10, పిటార్నో లాంటి వైరస్‌ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో పశువుల్లో ఉత్పాదకశక్తి, ఎద్దుల్లో సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగానూ, బలహీనంగా ఉండే యుక్త వయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడతాయి.

24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగు కారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు ఆబార్షన్‌కు గురవుతాయి. పాలిచ్చే ఆవుల్లో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. ఈ వ్యాధి సోకితే పటిష్టమైన ఎద్దులు కూడా బలహీనమై సామర్థ్యం తగ్గిపోతుంది.

నివారణ చర్యలు
వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్‌ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్‌ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్‌ మందులు తాగించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అయొడైజ్డ్‌ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి (మినరల్‌ మిక్చర్‌) పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. టీకాల వల్ల పశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అపోహలన్నీ వీడి పశువులు, ఎద్దులకు టీకాలు వేయించుకోవాలి.

మరిన్ని వార్తలు