ఎయిడెడ్‌ పోస్టుల దందా

26 Jul, 2017 23:27 IST|Sakshi
ఎయిడెడ్‌ పోస్టుల దందా
పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్న దళారులు
మోసపోవద్దుంటున్న విద్యాశాఖాధికారులు
 
ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. ఆ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అ«ధ్యాపక పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టుకు రూ.10 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం మీకే..సరేనండి ఇదిగో రూ.10 లక్షలు అంటూ కొందరు. ఇప్పుడు అంత ఇవ్వలేనండి రూ.5 లక్షలు ఇస్తున్నాను మిగతావి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాను అని మరికొందరు. ఆ సొమ్ముతేవడానికి అప్పులు చేసి కొందరు, ఇంట్లో బంగారునగలు, ఉన్నవి అమ్మి మరికొందరు పరుగులు మీద తెచ్చి లక్షల సొమ్ములు ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో దళారులు చేస్తున్న ఎయిడెడ్‌ పోస్టుల దందా. 
-కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ)
ఇదీ పరిస్థితి
జిల్లాలో 45 హైస్కూల్స్‌ ఉండగా వాటిలో 774 పోస్టులు ఉండేవి. వాటిలో ప్రస్తుతం 300 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీ, ఎలిమెంటరీ స్కూల్స్‌ 100 వరకూ ఉండగా వాటిలో 529 ఉపాధ్యాయులు పని చేసేవారు. ప్రస్తుతం 310 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 210 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న ఈ పోస్టులు 15 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండగా వాటిని 2004 అక్టోబర్‌ నుంచి భర్తీని బ్యాన్‌ చేశారు. తర్వాత 2005లో ఎయిడెడ్‌ సిబ్బంది కోర్టుకెళ్లారు. స్కూల్స్‌లో బోధకులు లేకపోవడంతో విద్యార్థులు ఉండడం లేదు, తాత్కాలిక పోస్టుల భర్తీ చేయాలంటూ పోరాటల ఫలితంగా 2013లో కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో తాత్కాలిక ప్రాతిపదికన ఎయిడెడ్‌ యాజమాన్యమే జీతాలు ఇచ్చుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తునే ఉంది. కొందరు బోధకులు అవసరం కావడంతో జీవో నెంబర్‌ 1 ప్రాతిపదికన బోధకులను నియమించుకున్నారు. ఈ బ్యాన్‌ను 30.6.2017న లిప్ట్‌చేసింది. అంతే....ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ జరుగుతున్నాయి. లక్షలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీకే అంటూ దళారులు దందా ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది అమాయకులు లక్షల రూపాయలు వారి చేతుల్లో పోసారు. దీనిపై విషయం తెలిసినా విద్యాశాఖ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఆ పోస్టులు ఏమిటి, ఎవరిని భర్తీ చేయాలనే దానిపై సమాచారం ఇస్తే అభాగ్యులు మోసపోయేవారు కారేమో. ఇలా మోసపోయిన కొందరు ‘సాక్షి’వద్దకు వచ్చి తమ బాధను తెలిపారు. తాము మోసపోయామని తెలిపారు. దీనిపై విద్యాశాఖ, ఎయిడెడ్‌ యాజమాన్యాలను ప్రశ్నిస్తే పలు విషయాలను వివరించారు.
ఏ పోస్టుల భర్తీ జరుగుతుంది?
కోర్టు ఉత్తర్వుల మేరకు 2002 నుంచి ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నేరుగా రెగ్యూలర్‌ అవుతుంది. ఆ తర్వాత కోర్టు 2013 ఇచ్చిన తీర్పుననుసరించి తాత్కాలికంగా జీవో నెంబర్‌ 1 ప్రాతిపదికన యాజమాన్యం జీతాలు ఇస్తూ భర్తీ చేసుకున్న తాత్కాలిక బోధకులకు ఫైవ్‌ మెన్‌ కమిటీతో ఇంటర్వూలు నిర్వహించి వారిని రెగ్యులర్‌ చేయాలి. ఇప్పటికే ఆ పక్రియ రాష్ట్ర కేంద్రంగా గుంటూరులో ప్రారంభమైంది. అయితే ఈ పక్రియలో ప్రథమంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఖాళీలను గుర్తించి రేషనలైజ్‌ చేయాలి, దీంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి, అంతే తప్ప ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో కొత్తవారికి ఉద్యోగాలు అనే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ పోస్టులు 2002 ముందు, 2013 తర్వాత ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే. 
మోసపోవద్దు
ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ అవుతున్నాయి. మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెపితే ఎవరూ నమ్మవద్దు. ఇది అంతా మోసం. కొత్తవారిని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో నియమించే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ విధానం ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై కొందరు లక్షల సొమ్ము గుంజుతున్న సమాచారం వచ్చింది. దళారులకు సొమ్ములు ఇచ్చి ఎవ్వరూ మోసపోవద్దు. 
-–ఎస్‌.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి
డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే
కోర్టు తీర్పునిచ్చింది డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే. అయితే కొందరు ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారని వచ్చి సొమ్ములు గుంజుతున్నారు. ఇదంతా మోసం. ఎవరూ నమ్మవద్దు. సొమ్ములు పొగొట్టుకోవద్దు. 
–బి.చిట్టిబాబు, ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega