మద్య నిషేధం ఏదీ బాబు?

27 May, 2017 22:52 IST|Sakshi
మద్య నిషేధం ఏదీ బాబు?
- ఐద్వా రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న
అమలాపురం రూరల్‌: ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్‌ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్‌ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్‌ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్‌ సూర్యనారాయణ, ఐద్వా లీగల్‌ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు