దుమ్ము రేపుతోంది!

23 Jul, 2017 23:05 IST|Sakshi
దుమ్ము రేపుతోంది!

– కాలుష్యపు కోరల్లో ‘అనంత’
– ఏ రోడ్డులో చూసినా అపరిశుభ్రతే
– ట్రాఫిక్‌ రద్దీతో వాహనాల కాలుష్యమూ అధికమే
– కళ్ల సమస్యలతో బాధపడుతున్న జనం


అనంత నగరంలో కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. ఎగిసి పడుతున్న దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యం చుట్టుముడుతుండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నివాస గృహాల నుంచి బయటకు వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో అత్యధికులు ఊపిరితిత్తులు, కంటి, శ్వాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.
- అనంతపురం మెడికల్‌

వాహన కాలుష్యమూ ఎక్కువే
అనంతపురంలోని రాం నగర్‌ సమీపంలో ఫై ఓవర్‌ పనులు సాగుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లాలంటే చాలా మంది జంకుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే స్థానికులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగరంలో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది.  టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, కలెక్టరేట్, కమలానగర్, సాయినగర్‌ తదితర ప్రాంతాల్లో వాహనాల నుంచి వెలువడే వాయువులు మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కంటి సమస్యలతో ఆస్పత్రికి రోజూ 120 మంది
దుమ్ము ధూళి కణాలు నేరుగా కళ్లలో పడడంతో జనం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మంటగా ఉండడం,  ఎర్రబారడం వంటి రుగ్మతలతో ఆస్పత్రుల బాట పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దుమ్ము ధూళి కణాలు కళ్లలో పడి కళ్లు మసకబారుతున్న 120 మంది వరకు నిత్యమూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కంటి విభాగానికి చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ కంటి ఆస్పత్రులను ఆశ్రయించే వారు దీనికి రెండింతలు ఉంటారని అంచనా. దుమ్ము ధూళి పడిన వెంటనే కళ్లను శుభ్ర పరచకుండా నలుపుతుండడంతో సమస్యలు తీవ్రమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు కంటి పైపొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

బయటకు రావాలంటే భయం
నగరంలో దుమ్ముధూళి ఎక్కువగా ఎగిసి పడుతోంది. చిన్న పిల్లలను తీసుకుని బయటకు రావాలంటే భయమేస్తోంది. ఫ్లై ఓవర్‌ పనులు జరుగుతున్న చోట అయితే పరిస్థితి మరీ ఘోరం. అసలు ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియడం లేదు. నేను ఇక్కడే చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ దుమ్ముతో ఇటువైపు వచ్చే వాళ్లే తగ్గిపోతున్నారు. నా వ్యాపారం దుమ్ముకొట్టుకుపోతోంది.
–  జహీర్‌బాషా, రహమత్‌నగర్, అనంతపురం

పరిస్థితి అధ్వానంగా మారింది
నగరంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎప్పుడు బయటకు వద్దామన్నా గాలి దుమారం రేగుతూ ఉంటుంది. రోడ్లు కూడా సరిగా శుభ్రం చేయకపోవడంతో గాలికి ధూళి కళ్లలో పడుతోంది. ఇంటికెళ్లగానే కళ్లను శుభ్రం చేసుకుంటే గానీ ఉపశమనం కలగడం లేదు.
– సతీష్‌, కోర్టు రోడ్డు, అనంతపురం  

కాలుష్యమే కంటి సమస్యలకు కారణం
కళ్లలో మంట, గరుకుగా ఉండడం, తరచూ నేత్రాలు ఎర్రబారుతున్నాయంటే వైద్యులను సంప్రదించండి. పెరుగుతున్న కాలుష్యమే దీనికి కారణం. ద్విచక్రవాహనాల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన అద్దాలు ధరించడం వల్ల సూక్ష్మ ధూళి రేణువులు, కణాలు కంటిలో పడకుండా చూసుకోవచ్చు. బైక్‌లపై తిరిగే వారు హెల్మెట్, గాగుల్స్‌ ధరించడం మంచిది. ధూళి కణాలు కంటి రెప్పల అడుగుభాగంలో చేరిపోతున్నాయి. చికిత్స తీసుకుంటే సరిపోతుంది. తరచూ కళ్లు, ముఖం కడుక్కోవడం మంచిది.
– డాక్టర్‌ పల్లా శ్రీనివాసులు, కంటి విభాగాధిపతి, సర్వజనాస్పత్రి  

నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం
దుమ్ము,ధూళి కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ముందుగా అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. ముక్కు దిబ్బడ, నీరు కారడం వంటివి జరుగుతాయి. ఇది కాస్తా ‘సైససైటిస్‌’కు దారితీస్తుంది. తలనొప్పిగా ఉండడం, ముక్కులో గడ్డలు వచ్చే ప్రమాదం ఉంది. కొంత వరకు కాలుష్యాన్ని ముక్కు నియంత్రించగలదు. చాలా రోజులు పరిస్థితి అలాగే ఉంటే దుమ్ము శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. బ్రాంకెటైటిస్, ల్యారింజైటిస్‌కు గురై ఊపిరితిత్తుల్లో పేరుకుపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. బయట ఎక్కువగా తిరిగేవాళ్లు తప్పనిసరిగా ముక్కుకు మాస్కులు ధరించండి.
– డాక్టర్‌ రాజేశ్, ఈఎన్‌టీ వైద్యుడు, సర్వజనాస్పత్రి

>
మరిన్ని వార్తలు