-

అఖిలమ్మ.. ఇదేంటమ్మా!

14 Jun, 2017 23:10 IST|Sakshi
అఖిలమ్మ.. ఇదేంటమ్మా!
– నేరుగా ఫోన్‌ చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
– అందరితో సఖ్యతగా ఉండాలని హితవు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్‌ చేసినట్టు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది.
 
అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. పదే పదే కలిసి వెళ్లాలని.. స్వయంగా సీఎం స్థాయిలో చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మంత్రిగా ఉండి గొడవలు పెంచడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. నంద్యాల సీటు విషయంలో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా మోహన్‌ రెడ్డి పార్టీ మారడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
 
పీఏ వ్యవహారశైలిపై ఆరా
నంద్యాల రాజకీయాలతో పాటు మంత్రి పీఏ వ్యవహరశైలిపైనా అధికార పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నీరు–చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్‌ పనుల విషయంలో పీఏ భారీగా అమ్యామ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు నేరుగా సీఎంకు వెళ్లినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఎందుకు కలుపుకుని వెళ్లడం లేదన్న అంశంపైనా మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద శిల్పా మోహన్‌ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
మరిన్ని వార్తలు