సీన్‌ రివర్స్‌..!

8 Feb, 2017 03:19 IST|Sakshi

నల్లగొండ : సరిగ్గా ఏడాది క్రితం మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. పల్లె నుంచి పట్నం వరకు నాటుసారా నామరూపాలు లేకుండా చేయడం ద్వారా మద్యం ఏరులై పారింది. దీంతో మద్యం విక్రయాల ద్వారా నెలకు సుమారు రూ.138.93 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీనికి పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు పయనిస్తున్నాయి. కారణాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకు రూ.2.75 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్‌ శాఖ వైఫల్యాన్ని పసిగట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నేరుగా రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది.  

నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో మద్యం దుకాణాలు 264, బార్లు 25 ఉన్నాయి. వీటి ద్వారా 2016 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు లిక్కర్‌ 2,37,794 పెట్టెలు అమ్ముడుకాగా...బీర్లు 2,52,750 పెట్టెలు అమ్మారు. తద్వారా ప్రభుత్వానికి రూ.114.92 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే రోజుల్లో లిక్కర్‌ 2,29,661 పెట్టెలు, బీర్లు 2,16,328 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ప్రభుత్వానికి రూ.112.17 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు 2.39 శాతానికి పడిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2.75 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

స్టేషన్ల వారీగా పరిశీలిస్తే....
మూడు జిల్లాల్లో కలిపి ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓలు 15 ఉన్నాయి. వీటిల్లో భువనగిరి ఎస్‌హెచ్‌ఓ మినహా మిగిలిన 14 స్టేషన్ల పరిధిలో లిక్కర్, బీర్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ప్రధానంగా బీర్ల విక్రయాలు మిర్యాలగూడ స్టేషన్‌ పరిధిలో 41.75 శాతం, నకిరేకల్‌ స్టేషన్‌ పరిధిలో 34.73, చండూరులో 19.70, హాలియాలో 29.91, నాంపల్లిలో 25.01, సూర్యాపేటలో 14.19, తుంగతుర్తిలో 27.73, హుజూర్‌నగర్‌లో 15.46 శాతానికి పడిపోయాయి. లిక్కర్‌ అమ్మకాలు దేవరకొండ స్టేషన్‌ పరిధిలో 12.17 శాతం, హాలియా 21.11 శాతం పడిపోయి. మిగిలిన స్టేషన్లల్లో 7.80 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి.

అధికారుల అన్వేషణ
మద్యం విక్రయాలు అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా ఎక్సైజ్‌ శాఖ కొన్ని ప్రధానమైన అంశాలతో ఒక నివేదిక రూపొందించింది. జిల్లా అధికారుల నివేదికలు, మద్యం వ్యా పారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను క్రోడీకరించిన స్టేట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నేరుగా రంగ ప్రవేశం చేసింది.

నివేదికలోని ప్రధానాంశాలు
లిక్కర్‌ విక్రయాలు తగ్గిన ప్రాంతాల్లో నాటుసారా ఆనవాళ్లు పూర్తిగా సమసిపోలేదని తెలిసింది. ప్రధానంగా దేవరకొండ, హాలియా, నాంపల్లి, మిర్యాలగూడ, చండూరు, తుంగతుర్తి స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో నాటుసారా విక్రయాలు ఊపందుకున్నాయి. సారాపై ఉక్కుపాదం మోపిన తర్వాత గ్రామాల్లో విపరీతంగా సేల్‌ అయిన ఆర్డనరీ (చీప్‌ లిక్కర్‌) లిక్కర్‌ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చీప్‌ లిక్కర్‌ సేల్స్‌ నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్, చండూరు, హాలియా, నాంపల్లి స్టేషన్ల పరిధిలో 14 శాతానికి పడిపోయాయి. కరెన్సీ ఇబ్బందుల వల్ల గ్రామాల్లో మందుబాబులు సారా బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్యం ధరల్లో స్ట్రాంగు బీరు రూ.95 నుంచి రూ.110కి పెంచారు. దీంతో బీర్లు సేవించే వారంతా మీడియం బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే ఎగువ మధ్యతరగతి వారు సేవించే ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో వాటి సేల్స్‌ కూడా 8 శాతానికి పడిపోయాయి.
 

మరిన్ని వార్తలు