అంతా బూటకమే!

5 Jan, 2017 23:54 IST|Sakshi
అంతా బూటకమే!
 – సీఎం ముచ్చుమర్రిని ప్రారంభించిన
    మరుసటి రోజే కేసీకి నీరు బంద్‌
– ముచ్చుమర్రి, మల్యాల నుంచి
  నీటి విడుదల నిలిపేసిన ఇంజినీర్లు
– ప్రతిపక్ష నేత రాకతో మధ్యాహ్నం 2 గంటలకు
   తిరిగి ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల
–  కరెంటు బిల్లుల చెల్లింపుల్లో కొరవడిన సమన్వయం
–   ఏ సర్కిల్‌ నుంచి బిల్లులు చెల్లించాలో
   స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని ప్రభుత్వం
 
కర్నూలు (సిటీ): రాయలసీమకు ముచ్చుమర్రి ఆయువుపట్టు లాంటిదని, ఈ స్కీముతో సీమను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ ఈనెల 2న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఆయన పథకాన్ని ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే  నీటి విడుదల నిలిచిపోయింది. బాబు చెప్పేదంతా బూటకమని కేసీ రైతులు ఆగ్రహం‍ వ్యక్తం చేస్తున్నారు.
  కర్నూలు – కడప (కేసీ)కాల్వకు సాగునీరు ఇచ్చేందుకు పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. పనులు పూర్తికాకపోయినా కూడా నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సీజన్‌ మొత్తం రెండు మోటార్ల ద్వారా  నీరు విడుదల చేసి పంటలు ఎండకుండా చూస్తామని సీఎం ప్రకటించారు. అయన హామీచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కేసీకి 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. ఈ స్కీమ్‌ ద్వారా కేసీకి 500 క్యూసెక్కులు, హంద్రీనీవా మొదటి లిఫ్ట్‌ మల్యాల దగ్గర నుంచి కేసీకి రెండు పంపుల ద్వారా మళ్లించిన నీటిని సైతం బంద్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ నేతలు నోరు మెదపక పోవడం గమనార్హం. 
 
ప్రతిపక్ష నేత రాకతో...
 రైతు భరోసా యాత్రలో భాగంగా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు వచ్చి  శ్రీశైలం ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కేసీకి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం  నుంచి నీరు బంద్‌ చేశారని గుర్తు చేయడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో దడ పుట్టింది. వెంటనే ముచ్చుమర్రి స్కీము నుంచి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో  రెండు మోటార్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. మోటార్లు బంద్‌ చేసిన విషయాన్ని  ప్రతిపక్ష నేత  ఎత్తి చూపే వరకు జిల్లా అధికార పార్టీ నేతలు  టీడీపీ పెద్దలను ఎదిరించలేక గమ్మున ఉండటంపై  రైతులు భగ్గుమంటున్నారు.
 
బాబూ.. ముందుచూపు ఏదీ?
రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరిలో తనకున్నంత ముందుచూపు ఏ నేతకు కూడా   సీఎం చంద్రబాబు నాయుడు  లేదని పదే పదే గొప్పగా చెబుతుంటారు. ఏ ప్రాజెక్టుకు, ఏ సర్కిల్‌కు అప్పగించాలి, దానిని ఎవరు నిర్వహించాలి అనే విషయంపై ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో  కేసీ ఆయకట్టుకు ఒక వైపు మల్యాల నుంచి, మరోవైపు ముచ్చుమర్రి నుంచి నీటి విడుదల బంద్‌ అయింది.  ఈ రెండు స్కీములకు రోజుకు సుమారు రూ.21 లక్షలు కరెంటు బిల్లు వస్తుండటం, ఆ బిల్లు ఏ సర్కిల్‌  చెల్లించాలో  ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే కాల్వకు నీరు బంద్‌ చేసినట్లు కొందరు ఇంజినీర్లు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు