అన్నీ వారికేనా?

7 Jul, 2017 02:38 IST|Sakshi
అన్నీ వారికేనా?
– నీరు–చెట్టు పనులపై రగిలిపోతున్న నంద్యాల టీడీపీ నేతలు
– ఆళ్లగడ్డ, బనగానపల్లె నేతలకు ఇవ్వడంతో మంత్రిపై కినుక
– అధినేతకు ఫిర్యాదు చేసిన మరో వర్గం నేతలు
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు : నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇందుకు తాజాగా నీరు–చెట్టు కింద చేపట్టిన పనులు వేదికగా మారాయి. ఈ పథకం కింద నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ అక్కడి కాంట్రాక్టర్లకు కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి అప్పగించడంపై అధికార పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన వారికి పనులను అప్పగించారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.
 
ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి మరో వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నంద్యాలలో ఇతర నియోజకవర్గాల వారి పెత్తనమేమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కార్యకర్తల కోసమే నీరు–చెట్టు పథకానికి రూపకల్పన చేసినట్టు స్వయంగా సీఎం చంద్రబాబు పార్టీ సమావేశాల్లో  చెబుతుంటే... ఇందుకు భిన్నంగా నంద్యాలలో జరుగుతోందనేది వారి వాదనగా ఉంటోంది. మరోవైపు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలోనూ కేవలం మంత్రి అఖిలప్రియ మాటనే చెల్లుబాటు అవుతుండటం ఇతర వర్గం నేతలకు మింగుడుపడటం లేదు. ఈ వ్యవహారంపై కూడా తాడోపేడో తేల్చుకునేందుకు అధికార పార్టీలోని మరో వర్గం నేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
 
పనులన్నీ వారికేనా?
నీరు–చెట్టు పథకం కింద నంద్యాల నియోజకవర్గంలోని అయ్యలూరు, మిట్నాలచెరువుల్లో పూడికతీత పనులను ఐదు ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఈ పనుల విలువ రూ.4.65 కోట్లు. ఈ ఐదు ప్యాకేజీ పనులను  ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడం, వారంతా పార్టీకి నేరుగా సంబంధం లేకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ వ్యవహారమే ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది. పార్టీ కోసం తామంతా కష్టపడుతున్నప్పటికీ కేవలం మంత్రి చెప్పిన వారికే పనులు అప్పగించడం ఏమిటనేది వారి ప్రశ్నగా ఉంది. పార్టీ కోసం కష్టపడుతున్న తమకు కూడా పనులు ఇస్తే అంతో ఇంతో వెనకేసుకునే అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయం. ఈ వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీఎం నుంచి పెద్దగా స్పందన లేకపోవడం ఇప్పుడా నేతలకు మింగుడు పడటం లేదు. 
 
లబ్ధిదారుల ఎంపికలోనూ..
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని సర్వే నివేదికలు రావడంతో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. నంద్యాల అభివృద్ధి పేరుతో ఏకంగా రూ.1,050 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో మహిళలకు కట్టుమిషన్లు, కాపులకు రుణాలు, రైతులకు ట్రాక్టర్లు.... ఇలా అనేకానేక పథకాలను రచించింది. అయితే, వీటి కింద లబ్ధిదారుల ఎంపికలో మంత్రి మాటకే విలువ ఇస్తుండటం ఇతర నేతలకు మింగుడు పడటం లేదు. తమ వెనకున్న అనుచరులకు ఈ పథకాల కింద లబ్ధి చేకూర్చకపోతే తామేమి సమాధానం చెప్పుకోవాలని వారు మండిపడుతున్నారు. ఇదే తీరు కొనసాగితే తామంతా ఎంత కష్టపడినప్పటికీ పార్టీకి అంతిమంగా నష్టమే జరుగుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశాన్ని త్వరలో అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.మొత్తమ్మీద అధికారపార్టీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ శ్రుతిమించుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
మరిన్ని వార్తలు