రోడ్డుపై రాస్తారోకో, ధర్నా, వంటావార్పు

18 Oct, 2016 18:06 IST|Sakshi

- పాలమూరులో కలిపే వరకు ఉద్యమం ఆగదంటున్న అఖిలపక్ష నాయకులు

దౌల్తాబాద్: పాలమూరు జిల్లాలో దౌల్తాబాద్ మండలాన్ని కలిపే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన నేపథ్యంలో దౌల్తాబాద్ మండలాన్ని వికారబాద్ జిల్లాలో కలపడం పట్ల మండల అఖిలపక్ష నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామల్లో నిరసనలు చేపట్టారు. గోకఫసల్‌వాద్ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకోతో పాటు వంటావార్పులు చేపట్టారు. తిమ్మారెడ్డిపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.

మండల కేంద్రంలో ఉదయం 11గంటల నుంచి మండలంలోని అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులతో నారాయణపేట-కొడంగల్ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. 60కి.మీ దూరంలో ఉన్న పాలమూరును వదిలి ఎక్కడో 90కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి గుట్టల్లో మండలాన్ని కలపడం అన్యాయమన్నారు. అయితే రాత్రికి రాత్రి మండలాన్ని వికారాబాద్‌లో కలిపిన నాయకులకు పుట్టగతులుండవని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మహిపాల్‌రెడ్డి, కూరవెంకటయ్య, రెడ్డిశ్రీనివాస్, భీములు, సతీష్, రాజు, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు