‘ములుగు’ కోసం అఖిలపక్షం ధర్నా

31 Aug, 2016 23:54 IST|Sakshi
‘ములుగు’ కోసం అఖిలపక్షం ధర్నా
 • మంత్రి, ఎంపీ రాజీనామా చేయాలి 
 • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క 
 • ములుగు : 
  ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు కాకుంటే మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ గత ఎన్నికల ముందు ఓట్లు దండుకునేందుకు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు.  ఏ అర్హత లేని భూపాలపల్లికి ములుగు ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయాలను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
   
  వరంగల్‌ జిల్లాలో భాగమై ఉన్న హన్మకొండను జిల్లా చేయడం కూడా రాజకీయ లబ్ధికోసమేనని అన్నారు. ధర్నా, రాస్తారోకోకు కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపారు.  మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ముప్పిడి సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు.
   
  కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా  ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ డివిజన్‌ నాయకుడు గూబ రాజు, నాయకులు ముసినేపల్లి కుమార్, చింతనిప్పుల బిక్షపతి, కోయిల రాంబాబు, బొమ్మకంటి రమేశ్, అచ్చునూరి కిషన్, యూనుస్, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, రాజునాయక్, ఉమాచందర్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు