బ్రహ్మోత్సవ సంబరానికి టీటీడీ సన్నద్ధం

27 Sep, 2016 18:37 IST|Sakshi

- అక్టోబరు 3 నుండి11వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- ప్రత్యేక ఆకర్షణగా దశావతారాల సైకత శిల్పం
- సీసీ కెమెరా నిఘాలో బ్రహ్మోత్సవాలు
- అన్ని ఆర్జిత సేవలు రద్దు, 7 లక్షల లడ్డూలు సిద్ధం


తిరుమల: తిరుమలలో అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవానికి నాందిగా మంగళవారం కోయిళ్‌ఆళ్వారు తిరుమంజనం వైదికంగా నిర్వహించారు. ఆలయం పరిమళంతో గుభాళిస్తోంది. ఇప్పటికే ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు పూర్తి చేశారు. గోపురాలకు వెల్లవేశారు. తిరువీధుల్లో రంగుల రంగవల్లులు అలంకరించారు. ఆలయానికి దేదీప్యమానంగా భారీ విద్యుత్ అలంకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ఎల్‌ఈడీ బల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రత్యేక ఆకర్షణ కానున్న శ్రీవారి సైకత శిల్పం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తకోటికి సైకత శిల్పం కనువిందు చేయనుంది. ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పం దర్శనమివ్వనుంది. దశావతరాల్లోని మశ్చ లేదా నృశింహ అవతారంలో ఏదో ఒక సైకత శిల్పాన్ని నిర్మించాలని సంకల్పించారు. సుమారు ఏడు ట్రక్కుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించనున్నారు. వరుసగా రెండేళ్లుగా వీరు రూపొందించిన 'వైకుంఠం నుండి భువికి ఆనంద నిలయం తీసుకురావటం', 'లక్ష్మీ భూ వరాహస్వామి' సైకత శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సీసీ కెమెరా నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈసారి బ్రహ్మోత్సవాల్లో అన్ని విభాగాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ విషయంలో టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాలకు ఏపీ డీజీపీ సాంబశివరావు తిరుమల పర్యటన సందర్భంగా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ దిశగా అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆలయంతోపాటు నిత్యాన్నప్రసాదం, కల్యాణకట్ట, ఇతర ముఖ్య కూడలి ప్రాంతాల్లో 400 పైచిలుకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాల కోసం అదనంగా మరో 150 కెమెరాలు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాత్రిసదన్-4 వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ కామాండెంట్ సెంటర్‌లో కంట్రోల్‌రూమ్ ద్వారా సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. సుమారు 3000 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో 1000 మందిని నియమించనున్నారు.

24 గంటలూ రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే 3 నుండి 11వ తేదీ వరకు తిరుపతి, తిరుమల మధ్య రెండు ఘాట్‌రోడ్లను తెరిచి ఉంచి వాహనాలు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. 7 లక్షల లడ్డూలు సిద్ధం  చేయనున్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
03-10-2016 - ధ్వజారోహణం( సా:6గం) - పెద్ద శేషవాహనం
04-10-2016 - చిన్నశేషవాహనం - హంసవాహనం
05-10-2016 - సింహవాహనం - ముత్యపుపందిరి వాహనం
06-10-2016 - కల్పవృక్షవాహనం - సర్వభూపాల వాహనం
07-10-2016 - మోహినీ అవతారం- గరుడ వాహనం
08-10-2016 - హనుమంతవాహనం,
సాయంత్రం స్వర్ణ రథోత్సవం - గజవాహనం
09-10-2016 - సూర్యప్రభ వాహనం- చంద్రప్రభ వాహనం
10-10-2016 - రథోత్సవం - అశ్వవాహనం
11-10-2016 - చక్రస్నానం - ధ్వజారోహణం

మరిన్ని వార్తలు