కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు సిద్ధం

3 Oct, 2016 23:36 IST|Sakshi
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి
కోటబొమ్మాళి: కోటబొమ్మాళి వాసుల కొంగుబంగారం కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలు మంగళవారం ఉదయం ఏడు గంటలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. గురువారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు.
 
ఇదీ స్థల పురాణం
 
స్థానికంగా ఉన్న కథనం ప్రకారం... 1925లో కోటబొమ్మాళికి చెందిన కమ్మకట్టు చిన్నప్పలస్వామి రెడ్డి అనే వ్యక్తి మండలంలో గల నారాయణ వలస గురువారం సంతకు ఎడ్లబండిపై సరుకులు రవాణా చేస్తుండేవాడు. ఒక రోజు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఒక వృద్ధురాలు బండిని ఆపి నడవలేకపోతున్నానని, బండి ఎక్కించి తీసుకువెళ్లమని కోరితే ఎక్కించాడు. ఆమె కోటబొమ్మాళి– కొత్తపేట తోట వద్ద బండి దిగి తోటలోకి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి అప్పలస్వామి రెడ్డి కలలో ఆమె కనిపించి తాను కోటబొమ్మాళిలో కొలువయ్యేందుకు వచ్చిన కొత్తమ్మతల్లినని, తను బండి దిగి వెళ్లిన తోటలోనే ఆలయం నిర్మించి ఏటా పోలాల అమావాస్య తర్వాత వచ్చే గురువారం పూజలు నిర్వహించాలని చెప్పింది. ఆ ప్రకారం అప్పటి నుంచి గురువారం ఒక్కరోజే ఉత్సవాలను చేసే వారు. భక్తుల సంఖ్య పెరగడంతో ముందు మంగళవారం నుంచి ప్రారంభించారు. తర్వాత ఆదాయం పెరగటంతో 1987లో దేవాదాయశాఖ ఈ ఆలయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది.  
 
భారీ ఏర్పాట్లు 
 
ఉత్సవాల కోసం కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డుపై ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి మండల పరిషత్‌ వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉచిత ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కొత్తపల్లి, తిలారు ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాల పరిధిలో ప్రత్యేక శిబిరాలకు చర్యలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ వి.శ్యామలదేవి ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, సభ్యులు, మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, ఆలయ మేనేజర్‌ వాకచర్ల రాధాకృష్ణ, గ్రామపెద్దలు జాతర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అలాగే కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్‌. వివేకానంద ఆధ్వర్యంలో టెక్కలి సీఐ భవాని ప్రసాద్‌ పర్యవేక్షణలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపాడ, జలుమూరు, టెక్కలి, ఎస్సైలతో సహా 350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపేట జాతీయ రహదారి జంక్షన్‌ నుంచి కోటబొమ్మాళి ఆర్టీసీ కాంప్లెక్సు మధ్య ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు స్థానిక ఎస్సై జి. నారాయణస్వామి తెలిపారు. జాతర జరిగే మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు, సంగిడి రాళ్ల పోటీలు నిర్వహిస్తారు. 
 
మరిన్ని వార్తలు