గుండెకు ఏ స్టంట్ అయినా ఒకటే..

26 Aug, 2016 20:40 IST|Sakshi
మాట్లాడుతున్న డాక్టర్‌ శివకుమార్, చిత్రంలో డాక్టర్లు శ్రీధర్‌రెడ్డి, నరసరాజు, సీతారాం

సాక్షి,హైదరాబాద్:మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచేందుకు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ, సాధారణ యాంజియోప్లాస్టీలో స్టంట్లను వాడటం సహజమని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా అందిస్తున్న స్టంట్లకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టంట్లకు జీవిత కాలం విషయంలో తేడాలేదని, ఖరీదైన స్టంట్‌ వేసుకున్నంత మాత్రన రోగి జీవితకాలం పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని.

కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా తెలంగాణ చాప్టర్‌ స్పష్టం చేసింది.  తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18–24 వరకు‘ఎటాక్‌ ది హార్ట్‌ ఎటాక్‌ వీక్‌’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను శుక్రవారం మెర్క్యరీ హోటల్‌లో చాప్టర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జె.శివకుమార్, కార్యదర్శి డాక్టర్‌ నరసరాజు, సీతారామ్, శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మట్లాడుతూ రోగి జీవితకాలం పెంపు, నాణ్యమైన జీవితం రోగి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, అతను వేసుకున్న స్టంట్‌పై కాదన్నారు. చికిత్స సమయంలో స్టంట్ల ఎంపిక పూర్తిగా రోగి ఇష్టంపైనే ఆధారపడి ఉండాలని, ఈ విషయంలో రోగులను బలవంతం చేయకూడదని వారు పేర్కొన్నారు. తీవ్రమైన గుండె పోటుతో బాధపడుతున్న బాధితుల్లో కేవలం 23 శాతం మందికే ప్రైమరీ కరోనరీ యాంజియోప్లాస్టీ(60 నిమిషాల్లో మూసుకుపోయిన గుండె రక్తనాళాన్ని తెరిపించడం) చికిత్సలు అందుతున్నాయన్నారు.

అవగాహన రాహిత్యం, మౌలిక సదుపాయాల లేమి కారణంగా మరో 73 శాతం మంది సాధారణ యాంజియోప్లాస్టీతో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. చికిత్సలో జాప్యంతో గుండె కండరాలు మరింత దెబ్బతింటున్నాయని, ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లడానికి పట్టణాల్లో నాలుగు నుంచి ఆరుగంటలు పడుతుండగా,గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు తేలిందన్నారు.

కేవలం 73 మందికే ఆ చికిత్సః
సర్వేలో భాగంగా 296 మంది బాధితుల నుంచి వివరాలు సేకరించగా, 73 మందికి మాత్రమే ప్రైమరీయాంజియోప్లాస్టీ చికిత్సలు అందినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 18 శాతం, జిల్లాల్లో 8 శాతం మందికి మాత్రమే ఈ సేవలు అందాయని వారు వివరించారు. తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్న బాధితులకు మందులు, ఇంజక్షన్ల కంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ చికిత్సే ఉత్తమమని,తద్వారా రోగి జీవితకాలాన్ని పెంచడంతో పాటు నాణ్యమైన జీవితాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.

 

మరిన్ని వార్తలు