పనులన్నీ ఏకకాలంలో

9 Nov, 2015 03:50 IST|Sakshi
పనులన్నీ ఏకకాలంలో

♦ 2017 నాటికి గోదావరి ప్రాజెక్టుల నుంచి తొలిదశ సాగునీరు
♦ బ్యారేజీల పనులకు సమాంతరంగా కాలువలు, టన్నెల్, లిఫ్టుల పనులు
♦ శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించండి
♦ మూడు షిఫ్టుల్లో పనులు.. ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు
♦ సుదీర్ఘ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
♦ శాఖలో కొత్త పోస్టులు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
 
 సాక్షి, హైదరాబాద్: గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులన్నీ తొలిదశలో 2017 వర్షాకాలం నాటికి సాగునీరును అందించేలా కార్యాచరణ రూ పొందించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరిపై ఏకకాలంలో కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి బ్యారేజీలతోపాటు దేవాదులకు నీరందించేలా కొత్తూరు(తుపాకులగూడెం) వద్ద మరో బ్యారే జీ నిర్మాణం జరగాలని సూచించారు. వీటితోపాటు కాలువలు, టన్నెళ్లు, లిఫ్టులు, రిజర్వాయర్ల పనులు కూడా సమాంతరంగా జరగాలని... ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. వీలయితే ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో రైతులంతా రెండు పంటలు పండించి సంతోషంగా ఉండాలన్నదే తన లక్ష్యమని, తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని రైతులు అనుభవించాలన్నారు.

సీఎం కేసీఆర్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్ పాండే, సీఈలు పురుషోత్తమరాజు, హరిరామ్‌లతో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. కాంట్రాక్టర్లు మూడు షిప్టుల్లో 24 గంటల పాటు పనులు చేయించాలని, బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు సూచించారు.

ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడ్‌మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లకు అదనంగా కాళేశ్వరం, ఎల్లంపల్లి, ఇమాంబాద్, అనంతగిరి, గంధమల, బస్వాపూర్, గౌరవల్లి, పాములపర్తి, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా చేపట్టాలన్నారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను కూడా తెలంగాణ అవసరాలకు తగినట్లుగా రూపొందించాలని చెప్పా రు. భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, ఆయా కలెక్టర్ల వద్ద భూసేకరణ కోసం పరి హారం ఇవ్వడానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నీటి పారుదల శాఖకు ఏటా రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నందున నిధుల కొరత లేదని, పనులు త్వరితగతిన జరగడమే ముఖ్యమని స్పష్టం చేశారు. గోదావరిపై వీలైనన్ని ఎక్కువ బ్యారేజీలు కట్టుకోవడం ఉత్తమమైన మార్గమని సమావేశంలో అంతా అభిప్రాయపడ్డారు.

 కాంట్రాక్టర్ల విషయంలో జాగ్రత్త
 కాంట్రాక్టర్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. టెండర్లను లెస్‌లో దక్కించుకొని తర్వాత పనులు చేయకుండా వదిలివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని.. దాంతో ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం లేదని పేర్కొన్నారు. అలాంటి కాంట్రాక్టర్ల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఓ విధానం రూపొందించాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు రెండు శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులంటే ఏళ్లకేళ్లు సాగడం ఆనవాయితీగా మారిందని... తెలంగాణలో రెండు, మూడే ళ్లలోనే పనులు పూర్తయి సాగునీరు అందాలని స్పష్టం చేశారు.
 
 కొత్త పోస్టులకు ఆమోదం
 కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు శ్రీరాంసాగర్ వంటి పాత ప్రాజెక్టులను మెరుగుపరుస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఏఈలు, ఏఈఈల నియామక ప్రక్రియ సాగుతున్నందున సీనియర్ అధికారులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. కొత్తగా 108 మంది ఉన్నతాధికారుల పోస్టులను కూడా మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. ప్రస్తుతమున్న 14 మంది సీఈలకు తోడుగా మరో 8 మంది, 39 మంది ఎస్‌ఈలకు అదనంగా ఏడుగురిని, 183 మంది ఈఈలకు తోడుగా 21 మంది, 619 మంది డీఈఈలకు తోడుగా 55 మందిని మంజూరు చేశారు. కొత్తగా 15 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇద్దరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టులను ఇచ్చారు. శాఖపరమైన పదోన్నతుల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు