అవినీతి బట్టబయలు

6 Oct, 2016 05:17 IST|Sakshi
రోడ్డు మూన్నాళ్లముచ్చటగా మారిన వైనాన్ని ఎంపీపీ లోలాక్షి, వైఎస్సార్‌సీపీ నేతలకు చూపిస్తున్న స్థానికులు

కంచిలి: చంద్రన్నబాట పథకం కింద తెలుగు తమ్ముళ్లు నిర్మించిన సిమెంట్‌ రోడ్లలో అవినీతి బట్టబయలైంది. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నది ప్రజల సాక్షిగా రుజువైంది. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నిధులు పక్కదారి పట్టించారన్న విషయంపై సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్థానిక టీడీపీ నేతలు మండిపడ్డారు. నిక్కచ్చిగా ఉన్నామని ప్రగల్భాలు పలికారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. రోడ్లలో నాణ్యత పాటించని అంశాన్ని ప్రజల సమక్షంలోనే బట్టబయలు చేశారు. దీంతో ఉదయం పూట కేకలు వేసిన టీడీపీ నేతలకు సాయంత్రానికి నోటికి తాళం పడింది.

 
కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఆమె భర్త, మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు ఇప్పిలి కృష్ణారావు, వైస్‌ఎంపీపీ ప్రతిని«ధి మునకాల వీరాస్వామిలు మండలంలోని ఎక్కల పంచాయతీలో 13,14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌డీపీ–ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాల రోడ్లను స్థానికులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఎక్కల గ్రామ బీసీ కాలనీలో కంచమ్మ అమ్మవారి ఆలయం వరకు రూ. లక్షల అంచనా వ్యయంతో ఈ ఏడాది పిభ్రవరి 28వ తేదీన నిర్మించిన రోడ్డు అప్పుడే శిథిలావస్థకు చేరిన విషయాన్ని నిర్ధారించారు. రోడ్డు పొడవునా బీటలు వారడాన్ని స్థానికులకు చూపించారు. పైగా ఈ రోడ్డు 5 నుంచి 6 ఇంచీల మందంగా నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన రోడ్డు ఒక ఇంచి మందం మాత్రమే ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నిర్మాణం సమయంలోనే ప్రశ్నించామని, రాత్రికి రాత్రే రోడ్డును నిర్మించారని స్థానికులు దీనబంధు, సంతోష్, జమున, తులసమ్మ తదితరులు ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డును తిరిగి నాణ్యతాప్రమాణాలతో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఇదే పంచాయతీలో అర్జునాపురం గ్రామంలో స్థానిక చెరువు గట్టు నుంచి మెయిన్‌రోడ్డు వరకు ఎస్సీల పరిధిలో రూ.3లక్షల ఎస్‌డీపీ, ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డు కూడా పూర్తిగా పాడైంది. స్థానికంగా ఉన్న ఓ టీడీపీ నాయకుడు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి ప్రజాధనాన్ని కాజేశాడని స్థానికులు వాపోయారు.
 

మరిన్ని వార్తలు