పాత నోట్లు.. కొత్త ఆలోచన

8 Jan, 2017 12:39 IST|Sakshi
పాత నోట్లు.. కొత్త ఆలోచన

పాత పెద్ద నోట్ల రద్దు దెబ్బకి అన్ని వ్యాపారాల్లాగే టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌ కూడా కుదేలైంది. సరిగ్గా పెళ్లిళ్లు, పార్టీలు, పండుగల సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కి ఫ్యాషన్‌ రంగానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోంది. వీటన్నింటి నుంచి స్ఫూర్తి పొందారో లేక, తనలోని క్రియేటివిటీకి పదును పెట్టారో గానీ నగరానికి చెందిన ఓ డిజైనర్‌.. నోట్ల రద్దునే తన డిజైన్లకు అంశంగా ఎంచుకున్నారు.                   

ఏటీఎం సెంటర్ల ఎదుట చాంతాడంత క్యూలో నిల్చోవడం దగ్గర్నుంచీ ఒకట్రెండు కొత్త నోట్లను చూస్తూ మురిసిపోవడం.. దొరికిన వాటిని పొదుపుగా వాడుకోవడం.. అలవాటు చేసింది నోట్ల రద్దు. అరుదైనదేదైనా అపురూపమేగా.. ఇప్పుడు కొత్త నోట్లు కూడా అపురూమైన అద్భుతాల్లా మారిపోయాయి. అందుకనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో  అవి కూడా భాగమైపోయాయి.

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన డిజైనర్‌ అల్తియాకృష్ణ నోట్ల రద్దు నుంచి స్ఫూర్తి పొంది ఈ ‘నోట్‌ డిజైన్స్‌’ను రూపొందించానన్నారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. అయితే ముందు కాస్త ఆలోచించినా, తర్వాత ఇది సృష్టించిన సంచలనం తనను మరింతగా డిజైన్ల తయారీకి ప్రోత్సహించిందన్నారు. కారణాలేవైనా కరెన్సీ నోట్ల గురించి ఈ మధ్య చర్చించిన్నంత ఎప్పుడూ మాట్లాడుకోలేదన్న అల్తియా... రద్దయిన  నోట్లతో పాటు కొత్తగా వచ్చిన నోట్ల తరహాలో డిజైన్స్‌ చేశారు. వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటికి వచ్చే స్పందనను బట్టి ఇదే తరహాలో మరిన్ని వెరైటీ డిజైన్స్‌ను రూపొందించే ఆలోచన   ఉందన్నారు.

షోపీస్‌లు కాదు...
సమ్మర్‌ సీజన్, ప్రస్తుత ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేసిన ఈ దుస్తులు కేవలం షోపీస్‌లు కావని, వయసుతో సంబంధం లేకుండా అందరూ ధరించడానికి అనువుగా రూపొందించానని చెప్పారు. వీటి తయారీకి 60 శాతం ఆర్గానిక్‌ కాటన్, 40 శాతం టస్సర్‌ సిల్క్‌ వినియోగించానన్నారు. రెగ్యులర్‌ ప్రింట్స్‌కు విభిన్నంగా నోట్‌ కలర్స్‌ కోసం బ్రైట్‌ కలర్స్‌తో కలెక్షన్‌ రూపొందించానన్నారు. నాలుగేళ్లుగా ఫ్యాషన్‌ రంగంలో ఉన్న అల్తియా... భారతీయ  ఎంబ్రాయిడరీ శైలుల్ని విభిన్నంగా వినియోగించడంలో పేరొందారు.  తన పేరు మీదే ఉన్న లేబుల్‌ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా బొటిక్‌లకు చిరపరిచితం.

– ఎస్‌.సత్యబాబు

మరిన్ని వార్తలు