ఆయకట్టు దారులంటే నిర్లక్ష్యమా?

15 Oct, 2016 22:36 IST|Sakshi
ఆయకట్టు దారులంటే నిర్లక్ష్యమా?

– శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి

అనంతపురం : ఆయకట్టు దారుల పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెచ్‌ఎల్‌సీ కింద శింగనమల నియోజకవర్గం పరిధిలో సుమారు 55 వేల ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు. గతేడాది నీరు ఇవ్వకపోవడంతో భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. ఈసారి అదే పరిస్థితి ఉందని, నీళ్లు అందుబాటులో ఉన్నా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 

ఆయకట్టుదారులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట గత నెలలో ధర్నా కూడా చేశామని గుర్తు చేశారు. తుంగభద్ర కాకుండా శ్రీశైలం నుంచి కష్ణాజలాలు కూడా హంద్రీ–నీవా ద్వారా దాదాపు 6 టీఎంసీలు నీళ్లు అదనంగా వచ్చాయన్నారు. ఆ నీటిని వదిలినా ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసుకునేందుకు వీలవుతుందన్నారు.  కష్ణా జలాలు మరో 10 టీఎంసీలు జిల్లాకు వస్తాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని,  మరి అందుబాటులో ఉన్న 6 టీఎంసీల నీళ్లు ఎందుకు నిల్వ ఉంచారని ప్రశ్నించారు.

మొత్తం నీటిని స్టోరేజీ చేసి కుప్పం తరలించేందుకు కుట్ర పన్నారా? అనే అనుమానాలను  వ్యక్తం చేశారు.  హక్కుగా రావాల్సిన నీటిని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ  జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగలింగారెడ్డి, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండన్న, మాజీ సర్పంచు నారాయణస్వామి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా