'విపత్తు తట్టుకునేలా నిర్మించాలి'

22 Nov, 2015 21:33 IST|Sakshi
'విపత్తు తట్టుకునేలా నిర్మించాలి'

విశాఖపట్నం: ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకోవాలని, ప్రభావిత ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రెండో ప్రపంచ విపత్తుల నివారణ సదస్సు సూచించింది. నాలుగు రోజుల పాటు విశాఖలో నిర్వహించిన ఈ సదస్సు ఆదివారం ముగిసింది. ప్రపంచంలోని 46 దేశాల నుంచి సుమారు 100 మంది నిపుణులు, వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు సభలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రసంగించారు. ఆఖరి రోజున విశాఖపట్నం డిక్లరేషన్ పేరిట సదస్సులో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను నిపుణుల కమిటీ చైర్మన్, బిహార్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఏకే సిన్హా వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంతోపాటు, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో వచ్చే విపత్తుల నివారణపై మరింత దృష్టి సారించాలి. ఇంకా ఏం చెప్పారంటే..

  • విపత్తుల నిర్వహణకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేయాలి.
  • ప్రకృతి వైపరీత్యాలకు నిధులు సమకూర్చే సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • విపత్తులకు ఎక్కువగా బాధితులయ్యే మహిళలు, పిల్లలు, యువత, వికలాంగులు, వృద్ధులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి.
  • కింది స్థాయిలో నాలెడ్జ్ మేనేజిమెంట్, అన్వేషణలను ప్రోత్సహించేందుకు ఒక వేదికను రూపొందించాలి.
  • ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం, ఇతర సంస్థలు విజయవంతంగా అమలు చేసిన చర్యలను, వాటి ఫలితాలను ఆయా దేశాలు పరస్పరం తెలియజేసుకోవాలి.
  • ప్రకృతి వైపరీత్యాలపై చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో పాఠశాల పిల్లలనూ భాగస్వాములను చేయాలి.
  • వాతావరణ మార్పులు, వాటి పర్యవసనాలపై అవగాహన కల్పించాలి.
  • గత వైపరీత్యాల తీవ్రత, నష్టాలు ప్రజలకు తెలిసేలా డిజాస్టర్ మ్యూజియం’లను ఏర్పాటు చేయాలి.
  • సాయం అందించడంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలి.
  • విపత్తుల నివారణకు అంతరిక్షం, టెలికాం, భూ విజ్ఞానశాస్త్రం, సైబర్, జియో మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.
  • ఇకపై రెండేళ్లకోసారి ప్రపంచ స్థాయి డిజాస్టర్ మేనేజిమెంట్ సదస్సులు నిర్వహించాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించాలి.
  • స్కూళ్లు, ఆస్పత్రులు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి భవనాల నిర్మాణాల్లో నాణ్యతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

మరిన్ని వార్తలు