హమ్మయ్య.. వచ్చేశాం

16 Jul, 2016 19:25 IST|Sakshi
హమ్మయ్య.. వచ్చేశాం
కొయ్యలగూడెం: ఉగ్రవాదుల దాడులు, కాశ్శీర్‌లో కర్ఫ్యూ, అల్లర్ల మధ్య తీవ్ర ఇబ్బందులు పడిన అమర్‌నాథ్‌ యాత్రికులు ఒక్కొక్కరుగా జిల్లాకు చేరుకుంటున్నారు. కొయ్యలగూడేనికి చెందిన మండా నాగేశ్వరరావు, అచ్యుతాపురం గ్రామానికి చెందిన తలకొండ సత్యనారాయణ శుక్రవారం వేకువజామున స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరు ఈనెల 1న కొయ్యలగూడెం నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లామని, యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో శ్రీనగర్‌లో చిక్కుకునిపోయామని చెప్పారు.

8 నుంచి 11వ తేదీ వరకు అక్కడ బస్టాండ్‌లోనే భద్రతా దళాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయామని చెప్పారు. శాంతిభద్రతలు మెరుగుపడిన తర్వాత భద్రతా దళాలు తమను ఢిల్లీకి  చేర్చారన్నారు. అక్కడ ఆంధ్రాభవన్‌లో ఆశ్రయం పొంది కోలుకున్న తర్వాత ఇక్కడకు చేరుకున్నామన్నారు. 

పరమ శివుని దయతోనే..
పోతవరం (నల్లజర్ల): పరమ శివుని దయ వల్లే తామంతా తిరిగి ఇంటికి చేరుకున్నామని పోతవరానికి చెందిన కందుల రవిశేఖర్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కాశ్శీర్‌లో అల్లర్ల నేపథ్యంలో మూడు రోజులపాటు శ్రీనగర్‌ బస్టాండ్‌లోనే భయం, ఆకలితో అసలు స్వస్థలం చేరుతామో లేదో అన్న భయంతో గడిపామన్నారు. మూడు రోజులు శ్రీనగర్‌లో చిక్కుకుపోవడంతో కాంగ్డా, ఛాముండి, నైనాదేవి ఆలయాలను సందర్శించకుండానే వెనుదిరిగామని చెప్పారు. కాశ్మీరుకు ఉత్తర భాగం హిమాలయాల్లో 14 వేల అడుగుల ఎత్తులో యాత్ర అత్యంత క్లిష్టంగా సాగిందని చెప్పారు. తనతో పాటు నల్లజర్ల, ఏలూరు, మక్కినవారిగూడెం తదితర ప్రాంతాల నుంచి 80 మంది బృందంగా వెళ్లామని చెప్పారు.
మరిన్ని వార్తలు