ర్యాగింగ్‌కు పాల్పడితే... బహిష్కరణ

12 Dec, 2016 14:57 IST|Sakshi
ర్యాగింగ్‌కు పాల్పడితే... బహిష్కరణ

అంబేడ్కర్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ చంద్రయ్య   
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌పై పాల్పడితే బహిష్కరిస్తామని  వర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వర్సిటీ చేపట్టిన ర్యాగింగ్ నిర్మూలన చర్యలు, భవిష్యత్‌లో ర్యాగింగ్ పట్ల వ్యవహరించే విధానాలను అధికారులు పరిపాలనా కార్యాలయంలో మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. నేరం ఎక్కువగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, విద్యార్థులపై ర్యాగింగ్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   ప్రస్తుతం వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం, క్యాంపస్ ప్రాంగణంలో నిఘా పెట్టామని, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు.  విద్యార్థులు తమ బాధ్యతలు విస్మరిస్తే విలువైన జీవితం కోల్పోతారని అన్నారు. ప్రతి విభాగంలో ప్రత్యేక ర్యాగింగ్ అవగాహన సదస్సులు న్యాయ నిపుణలతో పెట్టామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులు పట్ల ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి సైతం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయని చెప్పారు.  రాత్రులు సైతం వసతి గృహం పరిశీలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమావళి మేరకు ర్యాగింగ్ కేసులు క్రిమినల్ కేసులు కంటే తీవ్రంగా పరిగణించబడతాయని తెలిపారు. యూనివర్సిటీలో పటిష్టమైన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వ్యవస్థ ఉందని వివరించారు.  రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు