అమీతుమీ

29 Dec, 2016 02:25 IST|Sakshi
అమీతుమీ
చింతలపూడి : ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులు సిద్ధమవుతున్నారు. గత ఉగాది సంబరాలకు విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును రైతులు కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించడం కోసం కామవరపుకోటలో జిల్లా రైతు సదస్సు తలపెట్టారు. సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్‌ సీపీ  రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డితో పాటు రాష్ట్ర, రైతు సంఘం నాయకులు, జిల్లాలోని రైతు సంఘాల ముఖ్య నాయకులు,  రైతులు పెద్ద ఎత్తున సదస్సుకు తరలిరానున్నారు. సదస్సులో రాజకీయాలకతీతంగా జిల్లా రైతుల ప్రయోజనాలకు కాపాడేలా పోరాటానికి నిర్ణయం తీసుకోనున్నారు.
రెండో దశ మంజూరుతో ఆందోళన 
మొదటి దశ పనులే ఇంకా పూర్తి కాని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఇటీవల రెండో దశ మంజూరు చేయడం జిల్లా రైతుల్లో ఆందోళన కలిగి స్తోంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏడేళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. పరిహారం విషయంలో రైతుల అభ్యంతరాల నేపథ్యంలో భూసేకరణ సమస్యగా మారింది. రైతులు గత మే నెలలో ఆందోళనకు దిగి కాలువ తవ్వకం పనులను అడ్డుకోవడంతో 8 నెలలుగా పనులు నిలిచిపోయాయి. 
పరిహారంలో వ్యత్యాసం
జిల్లాలో పట్టిసీమ పథకం కాలువకు ఒకలా, చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువకు మరోలా నష్టపరిహారం అందజేయడంతో రైతులు భూసేకరణకు అడ్డుపడుతున్నారు. జిల్లాలోని పట్టిసీమ ప్రధాన కాలువ కింద రైతులకు ఎకరానికి రూ.30 లక్షలకు పైగా చెల్లించగా ఇక్కడ మాత్రం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. 
 
మరిన్ని వార్తలు