ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం

20 May, 2016 23:14 IST|Sakshi
ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం

- ఎర్రచందనం అక్రమరవాణాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా
- ఆస్తులను జప్తు చేసే అధికారం, బెయిల్‌కు వీలుకాని విధంగా కేసులు
- ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్‌లో సమూల సవరణలు.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి



విజయవాడ:
ఎర్రచందనం దొంగల తాటతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ -1967లో సమూల సవరణలు తీసుకువచ్చింది. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతున్న వారిపై ఈ సవరణలతో కొరఢా ఝుళిపించనుంది. ఎర్రచందనం దొంగలకు కళ్లెం వేసేందుకు సవరణలు తెచ్చిన ప్రభుత్వం ఎర్రచందనం చెట్ల నరికివేత, తొలగింపు, రవాణా, నిల్వ చేయడం, దొంగలకు సహకరించడం, వాహనాన్ని వినియోగించడం వంటి వాటిని తీవ్రనేరాలుగా పరిగణిస్తుంది.

ఈ నేరాలలో పట్టుబడితే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, పది లక్షల రూపాయల జరిమానా విధించేలా సవరణలు తీసుకువచ్చింది. వీరికి బెయిల్ కూడా మంజూరు కాదు.
తొలిసారి ఈ చట్టం కింద పట్టుబడితే 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష, 3 లక్షల రూపాయలు తగ్గకుండా జరిమానా విధిస్తారు. ఇదే నేరం కింద రెండోసారి పట్టుబడితే 7 ఏళ్లు తగ్గకుండా జైలు శిక్ష, 5 లక్షల రూపాయలకు పైబడి జరిమానా విధిస్తారు. స్మగ్లింగ్ కు వినియోగించే వాహనాల యజమానులకు ఇవే శిక్షలు అమలు చేస్తారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నేరస్తుల ఆస్తులను జప్తు చేసేలా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. స్మగ్లర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితుల పేరున ఆస్తుల కూడబెట్టినా వాటిని కూడా జప్తు చేసే అధికారం వుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ 1967 సవరణలకు రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదం తెలిపారు.

20 కేజీలకు మించి ఎర్రచందనం నిల్వ చేసిన ప్రతీవారిపై కొత్త సవరణ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఎవరైనా 20 కేజీలకు మించి ఎర్రచందనం కలప వుంటే వెంటనే తమ పరిధిలోని డీఎఫ్ఓకు సమాచారం అందించాల్సి వుంటుంది. ఎర్రచందనం కేసులను డీఎస్పీ స్థాయి అధికారి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విచారిస్తారు. ఇకపై ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన అన్ని కేసులను సివిల్ కోర్టుల్లో విచారించేందుకు వీలుకాకుండా సవరణలు చేయడంతో సంవత్సరాల తరబడి తప్పించుకునే వీలు లేకుండా పోయింది.
శుక్రవారం విజయవాడలోని సీఎంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిసిన డీజీపీ శ్రీ జేవీ రాముడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్-1967లో సవరణలపై వివరించారు. ఇక నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు సాగకుండా కట్టడి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీజీపీ సూచించారు. స్మగ్లర్లు, వారికి సహకరించేవారిపైనా కఠినంగానే వ్యవహరించాలని చెప్పారు.

మరిన్ని వార్తలు