అమ్మాయి పుట్టడం నేరమా..!

10 Aug, 2017 00:50 IST|Sakshi
అమ్మాయి పుట్టడం నేరమా..!
పట్టించుకోని భర్త, అత్తమామలు
అత్తింటి నుంచి బయటకు గెంటేసిన వైనం
ఐదురోజులుగా ఇంటి బయటే ఉంటున్న మహిళ
దేవరపల్లి: ’కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిలా పెంచాలిరా..’ అంటారు. అయితే ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా మహిళను, ఆమె బిడ్డను కనీసం చూడకపోగా అత్తింటికి వస్తే బయటకు నెట్టివేశారు. దీంతో ఐదు రోజులుగా తిండీ తిప్పలు, నిద్రాహారాలు మాని అత్తింటి గుమ్మంలోనే చంటిబిడ్డతో ఓ తల్లి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఆడపిల్లను కనడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నిస్తోంది. బాధితురాలు కథనం ప్రకారం. తడికలపూడి మండలంలోని గొల్లగూడెంకు చెందిన పద్మకు, ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటకు చెందిన గురజాల సత్యనారాయణతో 2015 జులై 5న వివాహమైంది. పద్మకు గతేడాది ఆగస్టు 28న ఆడపిల్ల పుట్టింది. ఏడాది గడుస్తున్నా తల్లీబిడ్డలను అత్తింటికి తీసుకువెళ్లేందుకు భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు రావడం లేదు. అదిగో, ఇదిగో అంటూ కాలం వెళ్లదీయడంతో పాటు సత్యనారాయణ కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో తమను వదిలేశారని భావించిన పద్మ బిడ్డను తీసుకుని ఈనెల 5న మలసానికుంటలో అత్తింటికి వచ్చింది. అయితే ఆమెను ఇంట్లోకి రాన్వికుండా భర్త, అత్తమామలు, భర్త అన్న కృష్ణ అడ్డుకుని బయటకు నెట్టేశారు. దీంతో ఇంటి గుమ్మం వద్దే బిడ్డతో కలిసి పద్మ భీష్మించింది. దీంతో అత్తింటి కుటుంబం అంతా ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో వారికున్న పొలంలోని పాకలో ఉంటున్నారు. భర్త సత్యనారాయణ గ్రామంలో ఉండటం లేదని బాధితురాలు చెబుతోంది. ఐదు రోజులుగా అత్తింటి వద్ద ఆరుబయట పద్మ చంటి పాపతో న్యాయం కోసం ఎదురుచూస్తోంది. విషయం తెలిసిన ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు బాధితురాలు పద్మతో మాట్లాడారు. తనకు కేసు వద్దని, కాపురం నిలబడేలా చూడాలని పద్మ ఆయన్ను కోరింది. కేసులు, కోర్టులకు వెళితే కాపురం చెడిపోతుందని ఆమె ఆందోళన చెందుతోంది. ఫిర్యాదు చేయకుంటే తాము ఎలా న్యాయం చేయగలమని, ముందు ఫిర్యాదు ఇవ్వమని ఎస్సై ఆమెకు సూచించారు. 
 
>
మరిన్ని వార్తలు