పెద్ద దర్గాలో ‘చుట్టాలబ్బాయ్‌’

25 Aug, 2016 18:38 IST|Sakshi
పెద్ద దర్గాలో ‘చుట్టాలబ్బాయ్‌’

కడప కల్చరల్‌ :
యువ సినీ హీరో ఆది నటించిన చుట్టాలబ్బాయి చిత్రం యూనిట్‌ గురువారం పెద్దదర్గాను దర్శించుకుంది. ఆదితోపాటు హీరోయిన్‌ నమిత ప్రమోద్, దర్శకుడు వీరభద్రం, ఇతర యూనిట్‌ సభ్యులు కూడా దర్గాలో ప్రార్థనలు చేశారు. దర్గా ముజావర్‌ అమీర్‌ వారితో ప్రదాన గురువుల మజార్‌తోపాటు దర్గా ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శింపజేసి గురువుల చరిత్ర, విశిష్ఠత, గొప్పతనాన్ని వివరించారు. హీరో ఆది చాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన తొలిచిత్రం విడుదలైన సందర్బంగా జరిగిన విజయయాత్రలో తిరుపతి నుంచి తాము పెద్దదర్గాకు వచ్చి గురువుల దర్శనం చేసుకున్నామన్నారు. దేశంలోని ప్రముఖ నటులంతా ఈ దర్గాను దర్శించుకుని గురువుల ఆశీర్వాదాలు పొందారని, ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తే కోరికలు తీరుతాయని, విజయాలు సిద్దిస్తాయన్న విశ్వాసం బాలీవుడ్‌ నటుల్లో సైతం ఉందన్నారు. ప్రస్తుతం విడుదలైన తన చుట్టాలబ్బాయి సినిమాను జిల్లా ప్రజలు బాగా ఆదరిస్తుండడం సంతోషాన్ని ఇస్తోందని, ఈ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టగలరన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దర్గాకు వచ్చిన నటీనటులను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానిక యువత ఉత్సాహం చూపారు.

మరిన్ని వార్తలు