అమృత హస్తం.. లోపాలే సమస్తం

21 Mar, 2017 23:45 IST|Sakshi
అమృత హస్తం.. లోపాలే సమస్తం
చింతలపూడి : ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత హస్తం పథకం గర్భిణులు, బాలింతల పాలిట శాపంగా పరిణవిుస్తోంది. వారిలో పోషకాహార లోపాలను నివారించేందుకు ఉద్దేశించిన ఈ పథకం లోపాలమయంగా మారింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు తరచూ పాడైపోతున్నాయి. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు రోజూ అన్నం, పప్పు, ఆకు కూరలతోపాటు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు అందజేయాల్సి ఉంది. అన్నం, పప్పు, ఆకు కూరలు కొంచెం అటూఇటుగా ఉంటున్నా.. పాలు మాత్రం పాడైపోయినవి ఇస్తున్నారు. 
 
ప్యాకెట్లు రోడ్డు ‘పాలు’
గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన వందలాది పాల ప్యాకెట్లు రోడ్డు పక్కన గుట్టలుగా దర్శనమిస్తున్న ఘటనలు చింతలపూడి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. చింతలపూడి నుంచి నాగిరెడ్డిగూడెం వెళ్లే రహదారి పక్కన ఖాళీ స్థలంలో కొద్దిరోజులుగా ఇవి దర్శనమిస్తుండటంపై ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. పాల ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. వీటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతో ఐసీడీఎస్‌ అధికారులే వీటిని ఖాళీ స్థలంలో పడవేయిస్తున్నట్టు వెల్లడైంది. ఇలాంటి ప్యాకెట్లను వెనక్కి పంపించి.. వాటిస్థానంలో తాజా పాల ప్యాకెట్లను పొందే అవకాశం ఉన్నా అధికారులు ఎందుకో ఆ పని చేయడం లేదు. దీని వెనుక కారణం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు.
 
90 రోజులు దాటితే అంతే..
ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ‘విజయ వజ్ర’ రకం పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇవి ప్యాక్‌ చేసిన తేదీ నుంచి సుమారు 90 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పాల ప్యాకెట్లు లీకవుతున్నా.. ఉబ్బినట్టు ఉన్నా వాటిని గర్భిణులు, బాలింతలకు సరఫరా చేయకూడదు. ప్యాకెట్లు లీకైనా.. ఉబ్బినా వాటిలోకి బ్యాక్టీరియా చేరుతుంది. చింతలపూడి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌కు గత నెలలో సరఫరా చేసిన పాల ప్యాకెట్లలో అత్యధిక శాతం పాడైపోవడంతో ఖాళీస్థలంలో పారబోశారు. తాజాగా.. మరోసారి వందలాది ప్యాకెట్లను నేలపాలు చేశారు. 
 
వీటిని సేవిస్తే ప్రాణాంతకమే..
బ్యాక్టీరియా చేరిన పాలను తాగితే గర్భి ణులు, బాలింతలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పారబోసిన ప్యాకెట్ల గడువు తేదీ దాటిపోంది. వీటిని ఎవరైనా సేవిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. కనీసం ప్యాకెట్లను కత్తిరించి పాలను పారబోసినా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా పాడైన ప్యాకెట్లను జనసంచారం ఉండే ప్రాంతంలో గుట్టలుగా పోస్తున్నారు. పొరపాటున వాటిపి ఎవరైనా తీసుకుని ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 
 
67 లీటర్లే పాడయ్యాయట
చింతలపూడి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరి« దిలో 277 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో 2,044 మంది గర్భి ణులు, 1,999 మంది బాలింతలు నమోదయ్యారు. వారికి ఇచ్చే నిమిత్తం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తు న్న పాలకు ప్రభుత్వం లీటర్‌కు రూ.40 చొప్పున చెల్లిస్తోంది. ఫిబ్రవరిలో చింతలపూడి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 15,039 లీటర్ల పాలు సరఫరా చేశారు. వీటిలో కేవలం 67.50 లీటర్ల పాలు మాత్రమే పాడయ్యాయని అధికారులు చెప్తున్నారు. మరి గుట్టలుగా పోసిన వందలాది లీట ర్ల పాల ప్యాకెట్ల సంగతేమిటని అడిగితే నీళ్లు నములుతున్నారు.
 
నాణ్యతపై అనుమానం
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల ప్యాకెట్లను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించకపోవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గర్భిణులు చూసుకోకుండా ఈ పాలను తాగితే వాంతులు, విరేచనాల పాలై ప్రాణాపాయ స్థితికి ప్రమాదం ఉంది. 
 
పాడైన ప్యాకెట్లు తీసుకోవద్దని చెప్పాం 
పాడైపోయిన పాల ప్యాకెట్లు తీసుకోవద్దని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు సూచించాం. గత నెలలో 67 ప్యాకెట్లు పాడైపోయినట్టు గుర్తించాం. వాటిని వెనక్కి ఇచ్చి.. వాటి స్థానంలో కొత్త ప్యాకెట్లు తీసుకున్నాం. పాడైపోయిన ప్యాకెట్లను కత్తిరించి అందులోని పాలను బయట పారబోయాల్సిందిగా పాలు సరఫరా చేస్తున్న కంపెనీ ప్రతినిధికి సూచించాం. ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – కె.విజయలక్ష్మి, ప్రాజెక్ట్‌ అధికారి, ఐసీడీఎస్, చింతలపూడి  
 
మరిన్ని వార్తలు