‘మీసేవ’ బాదుడు

10 Apr, 2017 12:09 IST|Sakshi
‘మీసేవ’ బాదుడు

► ఏ, బీ కేటగిర సేవలకు వర్తింపు
► ప్రజలపై ఏటా రూ.5.80 లక్షల భారం
► ప్రస్తుత చార్జీలే అధికమంటున్న సామాన్యులు
► 70కేంద్రాల్లో ఏడాదిలో 57,589 పత్రాల జారీ

ఆదిలాబాద్‌æఅర్బన్: ప్రభుత్వం ‘మీసేవ’ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకుగాను సర్వీసు చార్జీలను పెంచేసింది. మీసేవ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం పెంచిన సర్వీస్‌ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుకున్న సమయానికి కావాల్సిన ధ్రువపత్రం పొందేందుకు మీసేవ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెంచిన సర్వీస్‌ చార్జీలతో జనాలపై కొంత భారం పడనుంది.

ఇదిలా ఉండగా, రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే సేవలను కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’ అనే రెండు విభాగాలుగా చేసి సుమారు 60 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ సేవలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ రకాల సర్వీసులను కూడా మీసేవ కేంద్రాలు నిర్వర్తిస్తున్నాయి. కేటగిరి ‘ఏ’ లో ఉండే సేవల సర్వీస్‌ చార్జీలు ప్రస్తుతం రూ.25 ఉండగా, రూ.35కు పెరిగాయి. కేటగిరి ‘బీ’లో ఉండే సేవల సర్వీస్‌ చార్జీలు ప్రస్తుతం రూ.35 ఉండగా, రూ.45కు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న చార్జీలతోనే సామాన్య జనాలు ఇక్కట్లు పడుతుండగా.. పెంచిన చార్జీలతో ప్రజలపై మళ్లీ భారం పడింది.

ప్రజలపై భారం..
మీసేవ కేంద్రాల ద్వారా పొందే సేవలకు సర్వీస్‌ చార్జీలు పెంచడంతో ఆ భారం ప్రజలపై పడింది. జిల్లాలో 70 మీసేవ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఏడాదికి రూ.9వేల నుంచి రూ.12వేల వరకు సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలు ఏడాదిలో 58వేల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. పెంచిన చార్జీ ప్రకారం ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 లెక్కేసుకున్నా.. ఏడాదికి రూ.5.80 లక్షల భారం ప్రజలపై పడనుంది.

కేటగిరి ‘ఏ’, కేటగిరి ‘బీ’లోని సేవలకు సర్వీస్‌ చార్జీలు పెరగడమే కాకుండా ఐదు కన్నా ఎక్కువగా ఉన్న స్కానింగ్‌ కాపీలకు ఒక్కోదానికి రూ.2 చొప్పున వసూలు చేస్తారు. (అంటే ఒక డెసిడెన్సీ సర్టిఫికెట్‌ కావాలనుకుంటే దరఖాస్తుతో పాటు మనం ఆధార్, రేషన్ జిరాక్స్‌ కాపీలు అందజేస్తాం. అలా 10 కాపీలు ఇవ్వాల్సి వస్తే అందులో ఐదింటికి ఒక్కో పేజీ స్కానింగ్‌ కోసం రూ.2చొప్పున తీసుకుంటారు) కాగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా 57,589 వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

మీసేవలు ఇలా..
మీసేవ కేంద్రాలు రెవెన్యూ, విద్యా, విద్యుత్, మున్సిపల్, ఆర్టీఏ, హౌసింగ్, ఈసీ, రిజిస్ట్రార్‌ వంటి శాఖల సేవలను సైతం అందిస్తున్నాయి. కేటగిరి ఏ, బీలలో రెవెన్యూ సేవలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీలకు చార్జీలు పెరిగాయి. మిగతా శాఖల సర్వీసులకు చార్జీలు పెంచలేదు. అయితే కేటగిరి ‘ఏ’లో పహణీ, అడంగల్, వన్ బీ, ఆర్వోఆర్‌ లాంటి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు.

కేటగిరి ‘బీ’ ద్వారా కుల, ఆదాయ, రెసిడెన్సీ, ఓబీసీ, బర్త్, డెత్‌ సర్టిఫికెట్లు, ల్యాండ్‌ కన్వర్షన్, ఎఫ్‌ పిటిషన్, డిపెండెంట్, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్, అప్లికేషన్లు తదితర 60 రకాల సేవలు పొందవచ్చు. సిటిజన్ చార్ట్‌ ప్రకారం ఆయా ధ్రువపత్రాలకు గడువును బట్టి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఆన్ లైన్ సమస్యలతో సమయానికి సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు.

పెంచిన భారం ప్రజలపైనే..
ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మంచి సేవలందిస్తున్నా.. చార్జీలు పెంచి భారం వేస్తోంది. ప్రజలకు ఏది తప్పనిసరి అవసరమో దానికే చార్జీలు పెంచడం సరికాదు. ప్రస్తుతం ఉన్న చార్జీల భారం మోయలేకనే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ పెంచి మరింత భారం మోపారు.  – దేవన్న, ఆదిలాబాద్‌

ఓ విధంగా మంచిదే..
మీసేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సర్వీస్‌ చార్జీలు పెంచడమనేది ఓ విధంగా మంచిదే. ఇలా చేయడంతో మీసేవ నిర్వాహకులు మరింత ఉత్సాహంతో పని చేస్తారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, అవకతవకలకు పాల్పడకుండా ఉంటారు. ప్రజలకు కొంత భారమే అయినా మంచి పరిణామమే.  – రఘువీర్‌ సింగ్, మీసేవ జిల్లా కో ఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు