అనాథ శిశువుకు ఎస్పీ అంత్యక్రియలు

10 Oct, 2016 23:07 IST|Sakshi
అనాథ శిశువుకు ఎస్పీ అంత్యక్రియలు
కర్నూలు(హాస్పిటల్‌): నంద్యాలలో నాలుగురోజుల క్రితం ఆటో డ్రైవర్లు కాపాడిన అనాథ శిశువు సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకోలేక మృతిచెంది. ఈ పాపకు జిల్లా ఎస్పీ రవికృష్ణ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగురోజుల క్రితం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద వదిలేసిన పసికందును ఆటోడ్రైవర్లు కాపాడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక పాప మృతి చెందింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆసుపత్రికి వచ్చి మృతశిశువును హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ శిశువులను రోడ్డుపై వదిలివెళ్లడం మానవత్వానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే జన్మించిన ఆడపిల్లలను పెంచలేక రోడ్డుపై పడవేయకుండా దగ్గరల్లోని పోలీస్‌స్టేషన్‌కు గాని, చైల్డ్‌లైన్‌ 1098 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెబితే శిశువులను ఐసీడీఎస్‌ వారికి అప్పగిస్తారన్నారు. అంత్యక్రియల్లో కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, ఒకటో పట్టణ సీఐ బిఆర్‌ క్రిష్ణయ్య, నంద్యాల ఎస్సై మోహన్‌రెడ్డి, పోలీస్, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు