కోట్లు.. కొల్లగొట్టు!

30 Jun, 2017 23:35 IST|Sakshi
కోట్లు.. కొల్లగొట్టు!

అక్రమార్జనకు ‘అనంత’ కేంద్రం
– జిల్లాలో మేజర్‌ టెండర్లు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌కే
– ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లకు పైగా పనులను కట్టబెట్టిన ప్రభుత్వం
– పేరూరు, బీటీపీ రూపంలో మరో రూ.2,300 కోట్ల పనులు కట్టబెట్టే యత్నం
– పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లిచ్చే అవకాశం
- అయినా రూ.1130కోట్లతో డీపీఆర్‌
– 36వ ప్యాకేజీ ద్వారా నీళ్లిచ్చే మార్గం ఉన్నా రూ.1170 కోట్లతో బీటీపీకీ డీపీఆర్‌
– జిల్లా వెనుకబాటు బూచిగా దోపిడీ


ఏమన్నారంటే..
అభివృద్ధి విషయంలో ‘అనంత’కే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. కరువు రహిత జిల్లాగా మారుస్తాం. కరువును చూసి మనం భయపడటం కాదు.. మనల్ని చూసి కరువే భయపడేలా చేస్తాం.
– ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాటలివీ..

ఏం చేస్తున్నారంటే..
‘అనంత’ వెనుకబాటును బూచిగా చూపి రాజకీయ బలంతో వీలైనంత దండుకోవడం మినహా అభివృద్ధిపై చిత్తశుద్ధి కరువయింది. గత మూడేళ్లలో ప్రభుత్వం జిల్లాకు చేసిన అభివృద్ధి, ప్రస్తుతం అనుసరిస్తోన్న వైఖరి చూస్తే ముఖ్యమంత్రి నిజస్వరూపం తేటతెల్లమవుతోంది.

ప్రాజెక్టుల అంచనాలను అనూహ్యంగా పెంచడం.. టెండర్లను అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వందల కోట్ల రూపాయలను దండుకోవడమే ధ్యేయంగా సర్కారు ముందుకు సాగుతోంది. ఇద్దరు ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పంపకాల్లో తేడా వస్తే నేతలు పరస్పరం విమర్శించుకోవడం మినహా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా జిల్లా అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.

సాక్షిప్రతినిధి, అనంతపురం : వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌కు జిల్లాలో రూ.వెయ్యి కోట్ల పనులు కట్టబెట్టారు. గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌(జీబీసీ)కు సంబంధించి రూ.120 కోట్ల టెండర్‌ను ఈ సంస్థ చేజిక్కించుకుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనుల్లో మొదటి ప్యాకేజీకి సంబంధించి రూ.380 కోట్ల టెండర్‌ ఈ సంస్థ చేతిలో ఉంది. పనులు కర్నూలు జిల్లాలో జరుగుతున్నప్పటికీ వ్యవహారం హంద్రీనీవాదే. ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీలు నిర్మించేందుకు రూ.336కోట్లతో ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులో ఫేజ్‌–1లో రూ.250కోట్ల పనులను రిత్విక్‌ దక్కించుకుంది.

ఇవి కాకుండా రూ.300 కోట్లతో చేపట్టనున్న గుత్తి జాతీయ రహదారి పనులూ ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. ఇదే పనులను ముందుగా 12 శాతం తక్కువకు రిత్విక్‌ కోట్‌ చేసింది. ఈ టెండర్లను రద్దు చేయించి, తాజాగా 12 శాతం ఎక్కువకు తిరిగి అదే కంపెనీ టెండర్లను దక్కించుకుంది. ఈ మొత్తం పనుల విలువ రూ.వెయ్యి కోట్ల పైనే. ఇతర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చినా అధికార పార్టీ నేతల పక్కా వ్యూహంతో టెండర్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా పనులు జరుగుతున్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సీఎం రమేష్‌ సంతృప్తి పరుస్తారనే చర్చ జరుగుతోంది.

మరో రూ.2,300కోట్ల పనులు కట్టబెట్టే యత్నం
రిత్విక్‌కు మరో రూ.2,300కోట్ల పనులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీటీపీ(భైరవాన్‌ తిప్ప)కి ఆగస్టు 15న శంకుస్థాపన చేస్తానని చంద్రబాబు ఇటీవల రాయదుర్గంలో ప్రకటించారు. ఈ పనులకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదలశాఖ రంగం సిద్ధం చేస్తోంది. బీటీపీ ఫేజ్‌–1కు రూ.450కోట్లను ముఖ్యమంత్రి గతేడాది ఆగస్టు 15న ప్రకటించారు. అయితే అధికారులు రూ.1170కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. బోరంపల్లి లిఫ్ట్‌ నుంచి 50కిలోమీటర్ల దూరంలోని బీటీపీకి నీళ్లివ్వాలి. లైనింగ్‌ లేకుండా కేవలం మట్టిని తవ్వి చేసే పనులివి. కిలోమీటరుకు రూ.2కోట్ల చొప్పున లెక్కించినా రూ.వందకోట్లతో బీటీపీకి నీళ్లివ్వొచ్చు. కానీ రూ.1170కోట్లతో డీపీఆర్‌ పంపారంటే ఇందులో రూ.1070కోట్ల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది.

ఈ పనులను కూడా రిత్విక్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. నిజానికి సీఎం రమేశ్‌ కంపెనీ దక్కించుకున్న 36వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలోని ప్రధాన కాలువ జీడిపల్లి నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల మీదుగా హగరి నది వరకూ వెళ్తుంది. 36 ప్యాకేజీలో నుంచే బీటీపీకి నీళ్లిచ్చే మార్గం ఉంది. పైగా 36వ ప్యాకేజీ పనులను కూడా అమాంతం పెంచారు. 2005లో ఓం–రే(జాయింట్‌ వెంచర్‌) రూ.93.92కోట్లతో ఈ పనులను దక్కించుకుంది. ఇందులో రూ.38కోట్ల పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. మిగిలింది రూ.55కోట్ల పనులే. ఏడాదికి 10 శాతం చొప్పున అంచనా వ్యయం పెంచినా రూ.110కోట్లు ఖర్చవుతుంది. ఈ పనులకు రూ.336కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే ఓ దోపిడీయే. ఇంత భారీగా కేటాయింపులు ఉన్నప్పుడు.. బీటీపీకి దగ్గరగా కాలువ వెళుతున్నప్పుడు 36వ ప్యాకేజీ నుండే నీళ్లివ్వొచ్చు. అదనంగా తిరిగి జీడిపల్లి నుంచి సమాంతరంగా మరో కాలువను తవ్వాల్సిన అవసరం లేదు. రూ.1170కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనిలేదనే వాదన వనిపిస్తోంది.

పేరూరు పనులను కూడా..
పేరూరు ప్రాజెక్టుకు రూ.1130కోట్లతో డీపీఆర్‌ ప్రభుత్వానికి చేరింది. నిజానికి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌లో 26కిలోమీటర్‌ నుండి(6వ లిప్ట్‌ తర్వాత) తురకలాపట్నం వంకలోకి నీళ్లు వదలితే పేదకోడిపల్లి మీదుగా పావుగడ మండలంలోని నాగలమడక చెరువులోకి నీళ్లు చేరి నేరుగా పేరూరు డ్యాంకు అందుతాయి. ఈ పనికి స్వల్పంగా మాత్రమే ఖర్చవుతుంది. విపక్షాలైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లిచ్చే మార్గం ఇది అని చెబుతున్నాయి.

ఈ పనులకు రూ.1130కోట్లతో డీపీఆర్‌ పంపారంటే ఏస్థాయిలో దోపిడీ జరగనుందో అర్థమవుతోంది. ఈ పనులకు కూడా సెప్టెంబర్‌లో టెండర్లు పిలవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా రిత్విక్‌కే కట్టబెట్టాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇటీవలే రూ.300కోట్ల పనులను హంద్రీనీవా ఫేజ్‌–2లో రిత్విక్‌ చేసింది. మొత్తం పనులను నిశితంగా పరిశీలిస్తే దోపిడీ ఇట్టే అర్థమవుతుంది. ఈ నిధులను జిల్లాలో ఎమ్మెల్యేలకు వాటాలు పంచడం, మేజర్‌ వాటాను అమరావతిలో చినబాబుకు అప్పగించడం కోసమే అంచనా వ్యయాలను పెంచినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు