కీలక సమయంలో వరుణుడు మొహం చాటేశాడు

16 Jul, 2016 18:20 IST|Sakshi

కీలక సమయంలో వరుణుడు మొహం చాటేశాడు. నైరుతి రుతుపవనాలు ఏ మాత్రమూ ప్రభావం చూపడం లేదు. అడపాదడపా తుంపర చినుకులు తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షం కురవలేదు. జూన్‌లో రెండు దఫాలుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కొద్దోగొప్పో వానలు కురిశాయి. ఈ వర్షాలకు రైతులు ముందస్తుగా పంటలు సాగు చేశారు.

6 లక్షల హెక్టార్లలో పంటలకు ముప్పు
అడుగు ముందుకు పడని రక్షకతడి ప్రణాళిక

 
అనంతపురం అగ్రికల్చర్ :
జిల్లా వ్యాప్తంగా ఎన్ని హెక్టార్లలో పంటలు వేశారనే విషయంపై అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారుల వద్ద వేర్వేరు నివేదికలు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఒక అంచనా ప్రకారం వేరుశనగ పంట ఐదు లక్షల హెక్టార్ల వరకు సాగులోకి వచ్చింది. మిగతా పంటలు మరో లక్ష హెక్టార్లలో వేసినట్లు తెలుస్తోంది.  వేసిన పంటలకు మొదలుకుళ్లు, వేరుకుళ్లు, శనగపచ్చపురుగు, ఆకుముడుత తదితర పురుగులు, తెగుళ్లు వ్యాపించాయి. మొదట్లోనే తెగుళ్లు దాడి చేస్తుండటంతో  రైతులు వాటిని నివారించుకోలేక సతమతమవుతున్నారు.
 
 జాడలేని వర్షం
 పంటలు విత్తుకునేందుకు  జూలై కీలక మాసం. సాధారణంగా ఈ నెలలో మంచి వర్షాలు పడాలి. అయితే..చినుకు జాడ కనిపించడం లేదు. అరకొర తేమలోనే అక్కడక్కడ పంటలు వేసుకునే పరిస్థితి నెలకొంది.  మరోవైపు ఇప్పటికే వేసిన పంటలు వర్షం లేక వాడుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఒక్క మంచి వర్షం వస్తే అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. కానీ... నైరుతి రుతుపవనాలు  ప్రభావం   చూపడం లేదు. గాలులు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తుండటంతో మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి.    
 
338 మి.మీ వర్షం అవసరం
ఖరీఫ్ పంటలు పండాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షం కురవాలి. జూన్‌లో 63.9 మి.మీ సాధారణ వర్షపాతానికి గానూ కాస్త ఎక్కువగానే (94.5 మి.మీ) నమోదైంది. జూలైలో 67.4 మి.మీ కురవాలి. ఇప్పటిదాకా 4.6 మి.మీ మాత్రమే నమోదైంది. అది కూడా గాలిచినుకులు పడటంతో ఏ మాత్రమూ ప్రయోజనం లేని పరిస్థితి. ఇదే పరిస్థితి మరో వారం పది రోజులు కొనసాగితే... ఖరీఫ్ పంటలు ఆదిలోనే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది.

ఊసే లేని రక్షకతడి
ఖరీఫ్‌లో వేరుశనగ ఎండిపోకుండా రక్షకతడులు ఇచ్చి కాపాడతామని ఏడాదిగా గొప్పలు చెబుతున్నా ఆచరణలోకి మాత్రం రావడం లేదు. 10 లక్షల ఎకరాలకు రక్షకతడుల కోసం ఇటీవల ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి రూ.160కోట్ల బడ్జెట్‌తో జీవో విడుదల చేసినా ఆచరణలో మాత్రం ఒక్క అడుగు  ముందుకు పడటం లేదు. ఈ అంశంపై కలెక్టర్ ఇటీవల రెండు, మూడు దఫాలు వ్యవసాయశాఖ, ఏపీఎంఐపీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అయినా అమలుపై గందరగోళం నెలకొంది. జూన్ నెలాఖరుకు 13 వేల చొప్పున రెయిన్‌గన్లు, డీజిల్ ఇంజిన్లు, స్ప్రింక్లర్ సెట్లు, 6 లక్షల వరకు హెచ్‌డీ పైపులు జిల్లాకు చేరతాయని అధికారులు చెప్పారు. ఇప్పటికీ రాలేదు.

మరోవైపు వర్షం లేక అక్కడక్కడ నిర్మించిన నీటి కుంటలు (ఫారంపాండ్లు) ఎండిపోయాయి. హంద్రీ-నీవా, హెచ్చెల్సీ పరీవాహక ప్రాంతాల్లో కూడా నీరు లేదు. ఈ పరిస్థితుల్లో రక్షకతడులు ఎలా ఇస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. బోరుబావులున్న రైతులను ఎలాగైనా ఒప్పించి..వాటి ద్వారా ఒక్కో బోరు పరిధిలో 25 ఎకరాల వేరుశనగ పంటకు ఒకట్రెండు తడులు ఇప్పించాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. తమకున్న రెండు,మూడు ఎకరాలకు కూడా నీళ్లు చాలని బోరుబావుల నుంచి సమీపంలో 25 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమయ్యే పరిస్థితి కాదని రైతులు చెబుతున్నారు.
 
 ఆందోళనగా ఉంది -అమిదాల నాగేంద్ర, రైతు, రాప్తాడు
 నాకు ఆరు ఎకరాల సొంత పొలముంది.  రెండెకరాల్లో నీటివసతి కింద, నాలుగెకరాల్లో వర్షాధారంగా వేరుశనగ వేశా. మెట్ట భూమిలో మొత్తం ఆరు మూటల విత్తనాలు విత్తా. అలాగే ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో మూడు మూటల వేరుశనగ విత్తనాలు వేశా.  పంట సాగు చేసి 40 రోజులు కావస్తోంది. 20 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో పంట వాడిపోతోంది. ఎమి చేయాలో దిక్కు తోచడం లేదు.  వారం రోజులుగా పెనుగాలులతో భూమిలో తేమ శాతం తగ్గి పంటపై ప్రభావం పడుతోంది. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే పంటను మర్చిపోవాల్సిందే.

>
మరిన్ని వార్తలు