నేతల మాటలు.. నీటిమూటలే..

8 Jan, 2017 23:11 IST|Sakshi
నేతల మాటలు.. నీటిమూటలే..

► అభివృద్ధికి నోచుకోని అనంతారం ప్రాజెక్టు
►ఆనవాళ్లు కోల్పోతున్న  కుడి, ఎడమ కాలువలు
►మిషన్ కాకతీయ’లో చేర్చని సర్కారు


ఇల్లంతకుంట:  ఎకరం పారకం లేని కుంటలు, చెరువులను మిషన్ కాకతీయ ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం దాదాపు 10వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరందించే అనంతారం ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. మండలంలోని అనంతారంలో నిజాం రాజుల కాలంలో నిర్మించిన అనంతారం ప్రాజెక్టు పూడికతో పేరుకుపోవడంతో పాటు ఆనకట్ట పగుళ్లు వచ్చి భారీ వర్షాలు కురిసినప్పుడు నీరంతా వృథాగానే లీకైపోతుంది. మత్తడి నిర్మాణం, తూములు పాడైపోవడంతో గత మూడు నెలల క్రితం కురిసిన వర్షాలలకు ప్రాజెక్టు నిండింది. మూడు నెలలకే ప్రాజెక్టులోని నీళ్లన్నీ ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిండితే రహీంఖాన్ పేట, అనంతారం, తిప్పాపూర్, నారెడ్డిపల్లి, జంగంరెడ్డిపల్లి, గాలిపల్లి, ముస్కాన్ పేట, గాలిపల్లి, వంతడ్పుల, వల్లంపట్ల, కందికట్కూర్‌ గ్రామాల్లోని చెరువులకు నీళ్లు వెళ్లి 10వేల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి రానున్నాయి.

ఆనవాళ్లు కోల్పోతున్న కుడి,ఎడమ కాలువలు
ప్రాజెక్టు నుంచి ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువల ద్వారా 8 వందల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేయగా అవి కాస్త ముళ్లపొదలు, చెట్లతో నిండుకుపోయాయి. ఒక్క ఎకరానికి కూడా నీరందించే పరిస్థితి లేదు.సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పట్టించుకోని సర్కారు
చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి పొలాలకు నీరందించడమే లక్ష్యమంటున్న  ప్రభుత్వం ఒక్క ఎకరానికి సాగు నీరందించని చెరువులు, కుంటలు అభివృద్ధి చేస్తోంది, కానీ వేల ఎకరాలకు నీరందించే అనంతారం ప్రాజెక్టుపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలంటున్నారు. పలుమార్లు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ నీటిపారుదల శాఖమంత్రికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు స్పందించి ప్రాజెక్టును మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

త్రిబులార్‌లో పెట్టామని ఏడాదిన్నర..
ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు త్రిబులార్‌ పథకంలో పెట్టామని నిధుల మంజూరవ్వగానే అభివృద్ధి చేస్తామని స్థానిక నాయకులు ఏడాదిన్నర నుంచి చెప్పుతున్నారు తప్ప ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. చిన్న చిన్న చెరువులు, కుంటలకు నిధులు మంజూరవుతున్నాయే తప్ప ప్రాజెక్టు కోసం నయాపైసా కూడా మంజూరు కావడం లేదు.

మరిన్ని వార్తలు