అనంత, కర్నూలు జట్ల విజయం

11 Jul, 2017 22:54 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌–16 బాలికల అంతర్‌ జిల్లా క్రికెట్‌ పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని బీ- గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ఈరెండు జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచాయి.

స్కోరు వివరాలు

మొదటి మ్యాచ్‌లో అనంతపురం, వైఎస్సార్‌ కడప జట్లు తలపడగా, టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన అనంత జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 159 పరుగులు చేసి కేవలం 1 వికెట్‌ను కోల్పోయింది. జట్టులో పల్లవి 56 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యతను అందించింది. మరో ఆల్‌రౌండర్‌ అనూష 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైఎస్సార్‌ కడప జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంత జట్టు బౌలర్లు హిమజ 2, అఖిల 1 వికెట్లు సాధించారు. దీంతో అనంతపురం జట్టు 61 పరుగులతో విజయాన్ని సాధించింది.

చిత్తూరు చిత్తు

మరో మ్యాచ్‌లో చిత్తూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే సాధించింది. కర్నూలు జట్టు బౌలర్లు అరుణ 4 వికెట్లు, లక్ష్మి 3 వికెట్లు తీసి చిత్తూరు జట్టును చిత్తు చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 4.1 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 37 పరుగులు సాధించింది. దీంతో కర్నూలు జట్టు 10 వికెట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు