ఏపీకి పొంచి ఉన్న ‘క్యాంట్‌’ ముప్పు

26 Oct, 2016 08:55 IST|Sakshi
ఏపీకి పొంచి ఉన్న ‘క్యాంట్‌’ ముప్పు

విశాఖపట్నం: నడిసంద్రంలో ఇంతవరకూ ఊగిసలాడిన క్యాంట్‌ తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపే దూసుకొస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వైపు వెళ్తుందనుకున్న ఈ తుపాను చివరకు దిశ మార్చుకుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి తుపానుగా బలపడింది. ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 600, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 705, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

క్యాంట్‌గా నామకరణం చేసిన ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా పయనిస్తోంది. ఇది బుధవారం నాటికి ఒకింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాగల 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. పశ్చిమ దిశగా పయనిస్తూ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రేపటి నుంచి ఏపీ, ఒడిశాలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 28, 29 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఈ నెల 27 నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా తుపానుకు ‘క్యాంట్‌’ అనే పేరును మయన్మార్‌ సూచించింది.

మరిన్ని వార్తలు