వర్షాకాలం ఏకరువు

27 Oct, 2016 05:52 IST|Sakshi
వర్షాకాలం ఏకరువు

ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలంలోనూ కరువుఛాయలు కమ్ముకున్నాయి. గత ఏడాది అధిక వర్షాలు కురిసి చెరువు నిండి, భూగర్భజలాలు పెరిగినా నేడు అవి అనూహ్యరీతిలో పడిపోయాయి. చినుకు జాడ కరువైంది. ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. వాతావరణం పొడిబారిపోయింది. వానలు పడుతాయోలేదోనన్న అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలో  భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ స్థితిపై నిపుణుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.
 
 యూనివర్సిటీక్యాంపస్: అక్టోబర్ నెల వర్షాలకు బాగా అనుకూలమైన మాసం. ఈ నెలలో బాగా వర్షం కురుస్తుంది. అంతే కాకుండా ఈనెల 30న దీపావళి. తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు చలికాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ దశలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాలి. మంచి వర్షాలు కురవాల్సిన సీజన్ ఇది. అయితే వర్షపు జాడ కనించడంలేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ వర్షపాతం కన్నా చాలా తక్కువ వర్షపాతం పడింది. ఆగస్టు నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 117.4 మిల్లీ మీటర్లు అయితే 22.5 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షం పడింది.
 
 
 సెప్టెంబర్‌లో 141.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 36.4 మి.మీ మాత్రమే వర్షం పడింది. అక్టోబర్‌లో ఇప్పటివరకు 118.9 మిమీ వర్షపాతం పడాల్సి ఉండగా, ఇప్పటివరకు 23.9 మి.మీ మాత్రమే కురిసింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 558.3 మిల్లిమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 366.1 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైం ది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు బాగా పడినప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వర్షాలు సరిగా పడడం లేదు. ఇకపోతే ఎం డలు వేసవిని తలపిస్తున్నా యి.
 
  సాధారణంగా సెప్టెం బర్, అక్టోబర్‌లో 30 సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా ప్రతిరోజూ 36 సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. గత మంగళవారం 37.5 సెంటీగ్రేడ్‌ల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిని తలపిస్తుం దని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   అప్పడప్పు డు మేఘావృతం అయినప్పటికీ వర్షం పడలేదు. బాగా వర్షాలు కురవాల్సిన పరిస్థితుల్లో వర్షం పడకపోవడం, ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంపై శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు ఏమంటున్నారంటే...
 
 వాతావరణ అసమానతల వల్లే...
 ప్రాంతీయ వాతావరణంలో అసమానతలు(రీజనల్ వార్మింగ్) వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా 4,5 కి.మీ పొడవునా చెట్లు లేకపోవడం, చెట్లు నరికి వేయడం, తడి, పొడి చెత్తను 2,3 నెలల పాటు నిల్వ చేసి ఒకేసారి కాల్చివేయడం, గ్రీన్‌హౌస్ ప్రభావం కన్పిస్తుంది. వాతావరణంలో మిథేన్, కార్బన్‌డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల వాతావరణంలో వేడెక్కి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. అంతే కాకుండా కరువు పరిస్థితుల వల్ల పంటలు వేయకుండా బీడు భూములు ఉండడంతో ఈ పరిస్థితి సంభవిస్తుంది. ముఖ్యంగా శని, ఆది వారాల్లో వాహనాల వినియోగం ఎక్కువగా ఉండి అవి విడుదల చేసే వాయువుల వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
 - ప్రొఫెసర్ వైవీ . రామిరెడ్డి, రసాయన శాస్త్ర విభాగం, ఎస్వీయూ
 
 వాహనాల కాలుష్యం వల్ల...
 మోటార్ వాహనాల వినియోగం పెరిగింది. వీటి నుంచి వెలువడే వాయువుల వల్ల వాతావరణంలో క్లోరో, ప్లోరో కార్బన్‌ల శాతం అధికమౌతుంది. వీటి పరిమాణం పార్ట్ ఫర్ మిలియన్స్(పీపీఎం)లలో ఉండాల్సి ఉండగా ఎక్కువగా ఉంది. దీని వల్లే ఈ పరిస్థితి నెలకొంది. చెట్లను నరికి వేయడం, పచ్చదనం తగ్గడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది.
 - ప్రొఫెసర్ బి. దేవప్రసాద్‌రాజు , ఫ్యూచర్ స్టడీస్ విభాగం, ఎస్వీయూ
 
 మరో ఐదు       రోజులు వర్షం లేనట్టే
 సెప్టెంబర్‌లో తక్కువ వర్షం పడగా, అక్టోబర్‌లో సైతం ఇదే పరిస్థితి ఉంది. మేలో మంచి వర్షం పడింది. జూన్, జూలైలో సాధారణ వర్షపాతం కురిసింది. అయితే ఆగస్టు నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో ఐదు రోజుల పాటు వర్షం కురిసే అవకాశాలు లేవు.  ఐదు రోజుల పాటు పొడి వాతా వరణం నెలకొని ఉంటుంది.
 - డాక్టర్ టి. ప్రతిమ , సీనియర్ సైంటిస్ట్, ఆగ్రోమెట్ విభాగం,
 వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన స్థానం.
 

మరిన్ని వార్తలు