ఇక ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు

3 Dec, 2015 18:53 IST|Sakshi
ఇక ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్సిటీల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రతినిధులతో గురువారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సమావేశమయ్యారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీల విధానం అమలవుతోందని, దేశంలోని మొత్తం 732 యూనివర్సిటీల్లో రెండు వందలకుపైగా ప్రైవేటు యూనివర్సిటీలేనని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏపీలో ప్రముఖ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు.
 
నిర్ణయం తీసుకుని చర్చలేంటి?
 ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతిస్తూ బిల్లు తేవాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకున్న తర్వాత తమతో చర్చలు జరపడం సరికాదని ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, ఏవీఎస్ శర్మ, గేయానంద్, వై.శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి గంటాతో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిల్లు విషయంలో ముందే తమతో చర్చించి ఉంటే ఉన్నత విద్యావ్యవస్థ పటిష్టతకు మరింత ఉపయోగం ఉండేదన్నారు.

 

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1700 పోస్టులు భర్తీ చేయకపోవడంతో కేంద్ర నుంచి ఆర్‌యుఎస్‌ఎం, యూజీసీ నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీచేయకుండా, నిధులు సమకూర్చకుండా, వాటిని పటిష్టం చేయకుండా నిర్లక్ష్యం చేసి ఉన్నత విద్యను కూడా ప్రైవేటీకరణ చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు.
 

మరిన్ని వార్తలు