ఏపీపీఎస్సీలో సమాచార బ్యాంకు

18 Jun, 2016 13:12 IST|Sakshi

* నిరుద్యోగుల సమాచారం నిక్షిప్తం
* ఆనందం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు
* ఒక్కసారి నమోదు చేస్తే చాలు

విజయనగరం:  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తుల సమయంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సాంకేతికత సాయం తీసుకుంది. పరీక్ష ఏదైనా విద్యార్థి లేదా నిరుద్యోగి ఒక్కసారి డేటా నమోదు చేసుకుంటే వాటిని ప్రతి సారీ వాడే వెసులుబాటును తీసుకువచ్చింది.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ ఏపీపీఎస్సీ ద్వారానే వస్తుంటాయి. వీటికి తరచూ దరఖాస్తులు చేయడం అభ్యర్థులకు కాసింత కష్టం గానే ఉంటోంది. తాజాగా అమలు చేస్తున్న కొత్త విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే చాలు వాటిని ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో నిక్షిప్తం చేస్తుంది. మధ్యలో మన అర్హతలు పెరిగితే వాటిని మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది.
 
అర్హతల నమోదుకు అవకాశం..
పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న ప్రతీ విద్యార్థి విద్యార్హత వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో, సంతకం, సహా ఆన్‌లైన్‌లోని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్, ఈ మెయిల్ అడ్రస్‌లకు ఓ మెసేజ్ వస్తుంది. దీనిలో వచ్చిన కోడ్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరి చి సబ్‌మిట్ చేయాలి. దీంతో నమోదు ప్రక్రి య పూర్తి అవుతుంది. అనంతరం ఆ వ్యక్తికి ఒక శాశ్వత నంబరు ఇస్తారు. ఏటా కొత్తగా వచ్చే విద్యార్హతలు ఎప్పటికప్పుడు నిరుద్యోగికి సంబంధించిన ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
 
ప్రయోజనాలు..
ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముం దుగా మనకు కేటాయించిన శాశ్వత నంబరు ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు. మనం దరఖాస్తు చేసినట్లే. దీనివల్ల ఉద్యోగ ప్రకటన వచ్చే ప్రతి సారీ నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డేటా బ్యాంకులో అప్పటికే విద్యార్థి లేదా నిరుద్యోగి విద్యార్హతలు నమోదై ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఏ పరీక్షకు అర్హత ఉందో తెలుసుకొని దానికి మనం రుసుం చెల్లిస్తే సరిపోతుంది.
 
మున్ముందు పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే...
విద్యార్థి లేదా నిరుద్యోగులకు సంబంధించిన ప్రొఫైల్ పొందు పరుచుకొనే విధానాన్ని మొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన ఏపీపీఎస్సీ ఇకపై ప్రతి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన శాఖా పరమైన పరీక్షలు (డిపార్టుమెంట్ టెస్టులు) ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన పరీక్షలు రాసే వారు ఇబ్బంది పడకుండా మాక్ టెస్టులను అందుబాటులో ఉంచారు. దీని వల్ల ఆన్‌లైన్ పరీక్ష అంటే భయపడాల్సిన పని లేదు.
 
ఇలా నమోదు చేసుకోవాలి...
ప్రతీ విద్యార్థి ‘పీఎస్‌ఈ.ఏపీ.జీఓటీ.ఐన్’ వెబ్‌సైట్లోకి వెళ్లి అక్కడ సూచనలకు అనుగుణంగా విద్యార్హతలు, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో ఏమైనా ఇబ్బం దులు వస్తే ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఈ నెల నుంచే అందుబాటులోనికి తీసుకువచ్చారు.
 
నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరం
ఈ కొత్త సమాచార నిక్షిప్త కార్యక్రమం నిరుద్యోగులకు ఎంతో ఉపయోకరం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు తమ ధ్రువపత్రాలను ఒకేచోట ఉంచడం, కొత్త విద్యార్హతలు పొందిన సందర్భంలో వాటిని అదనంగా నమోదు చేయడం మంచి విధానం. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్లవం వచ్చాక ఉద్యోగార్ధులకు కూడా ప్రాధాన్యం ప్రకారం ఉద్యోగాల కల్పన, దరఖాస్తులకు కొత్త విధానం రావడం అభినందనీయం.
-  తూముల నాగ కార్తీక్, కరస్పాండెంట్
తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాల, కోమటిపల్లి

మరిన్ని వార్తలు