ప్రొఫెసర్ కిడ్నాప్‌నకు ఏడాది

27 Jul, 2016 20:00 IST|Sakshi

గత ఏడాది జూలై 29వ తేదీన లిబియా దేశంలో ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. అప్పట్లో మన దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఇద్దరు కర్ణాటక వాసులు కాగా మరొకరు హైదరాబాదుకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ ఉన్నారు. వీరిలో కర్ణాటక వాసులను విడుదల చేసిన తీవ్రవాదులు బలరాం, గోపీకృష్ణలను మాత్రం బందీలుగానే ఉంచుకున్నారు.

 

గోపీకృష్ణ లిబియాలో స్రిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురైన తరువాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు తదితరులు అతని తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదీకి ఏడాది పూర్తవుతున్నప్పటికీ గోపీకృష్ణ నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పట్లో గోపీకృష్ణ భార్య కల్యాణి, సోదరుడు మురళీకృష్ణ రాష్ట్రపతిని సైతం కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉండగా గోపీకృష్ణ విడుదల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వాలు ఆయా కుటుంబ సభ్యులకు ఇటీవల కాలంలో పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి.

మరిన్ని వార్తలు