‘ఆంధ్రారోమ్‌’లో క్రిస్మస్‌ కాంతులు

23 Dec, 2016 20:35 IST|Sakshi
‘ఆంధ్రారోమ్‌’లో క్రిస్మస్‌ కాంతులు
వేడుకలకు ముస్తాబైన బాలయేసు దేవాలయం
 
ఫిరంగిపురం : ఆంధ్రారోమ్‌గా ప్రసిద్ధి చెందిన ఫిరంగిపురంలోని బాలయేసు కథెడ్రల్‌ దేవాలయం క్రిస్మస్‌ వేడుకలకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విచారణ గురువు బెల్లంకొండ జయరాజు నేతృత్వంలో జరిగే వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.  ప్రార్థనలు చేసుకొని మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. కార్మెల్‌భవన్‌తో పాటు సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ ఆవరణలో భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి సైతం వేలాది మంది భక్తులు క్రిస్మస్‌ పర్వదినానికి తరలివస్తున్నారు. కులమతాలకతీతంగా గ్రామంలో క్రిస్మస్‌ పండుగ నిర్వహించుకుంటారు. బంధువులు, స్నేహితుల రాకతో ప్రతి ఇల్లూ కోలాహలంగా మారింది. ఆలయంలో కొవ్వొత్తుల సమర్పించిన అనంతరం కొండపైన ఉన్న కార్మెల్‌మాతను దర్శించుకుంటారు.
 
నేటి నుంచి ప్రత్యేక ప్రార్థనలు..
24వతేదీ అర్ధరాత్రి జరిగే దివ్యపూజాబలి కార్యక్రమంలో బిషప్‌ తిప్పాబత్తిన భాగ్యయ్య పాల్గొని వేడుకలను ప్రారంభిస్తారు. 25న ఉదయం బాలయేసు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం గ్రామ వీధుల నుంచి బాలయేసు ప్రతిమను ఊరేగింపుగా కొండమెట్ల వరకు ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో పెద్ద మొత్తంలో బాణసంచా కాలుస్తారు.
 
పండుగపై పెద్దనోట్ల ప్రభావం...
పెద్దనోట్ల ప్రభావం పండుగపై పడింది. ఏటా 22వతేదీ నాటికి పలు రకాల బొమ్మల దుకాణాలు విరివిగా వచ్చేవి. గ్రామంలో కూడా 10 రోజుల ముందు నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలుతో కిరాణా దుకాణాలు కిటకిటలాడేవి. దుస్తుల షాపుల సైతం వెలవెలబోతున్నాయి. 
మరిన్ని వార్తలు