ఇసుక డంపుల తరలింపుపై ఆందోళన

9 Aug, 2016 19:40 IST|Sakshi
కుటుంబసభ్యులతో కలిసి ధర్నా చేస్తున్న ట్రాక్టర్‌ యజమానులు
  • లారీలను అడ్డుకున్న ట్రాక్టర్‌ యజమానులు
  • పోలీసుల తొలగింపుతో ఉద్రిక్తత
  • కరీంనగర్‌ రూరల్‌ : కరీంనగర్‌ మండలం ఎలగందల్‌లో మంగళవారం ఇసుక అక్రమ డంపులను తరలించేందుకు వచ్చిన లారీలను ట్రాక్టర్‌ యజమానులు కుటుంబసభ్యులతో కలిసి అడ్డుకున్నారు. ఇసుక అక్రమరవాణా పేరిట అధికారులు చేస్తున్న దౌర్జన్యంతో తాము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు గతనెల 31 నుంచి ఇసుకడంపులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో పర్మిట్లు పొందిన లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ట్రాక్టర్‌ యజమానులు ఈనెల 7న లారీలు వెళ్లకుండా కందకాలు తవ్వి అడ్డుకున్నారు.
    లారీలను నిలిపివేసి రాస్తారోకోకు దిగారు. అయినా అధికారులు తమపనికానిస్తున్నారు. దీంతో మంగళవారం సర్పంచ్‌ ఎర్ధండి ప్రకాశ్, నాయకులతో కలిసి ట్రాక్టర్‌ యజమానులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ జయచంద్రారెడ్డి, ఇన్‌చార్జీ సీఐ వెంకటరమణ పోలీస్‌బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ఇసుక రవాణాతోనే తాము ఉపాధి పొందుతున్నామని, అక్రమ ఇసుక పేరిట వేధింపులను మానుకోవాలని యజమానులు డిమాండ్‌ చేశారు. అధికారులు మాట్లాడుతూ అక్రమ ఇసుకడంపులను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని, లారీలను అడ్డుకుంటే కేసులు పెడుతామంటూ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న ట్రాక్టర్‌ యజమానులు, కుటుంబసభ్యులను పోలీసులు బలవంతంగా తొలగించడంతో వివాదం ముగిసింది. 
మరిన్ని వార్తలు