అంగన్‌వాడీల మూకుమ్మడి డుమ్మా!

21 Sep, 2016 20:09 IST|Sakshi
చేర్వాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న హేమలత
  • ఒక్కరోజే 20 మంది గైర్హాజర్‌
  • సూపర్‌వైజర్‌ కూతురు బారసాలకు తరలివెళ్లిన వైనం
  • దుబ్బాక: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో రోగ నిరోధక శక్తి పెంచాలని, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తోన్న ఐసీడీఎస్‌ పథకం అధికారుల పర్యవేక్షణా లోపంతో నిర్వీర్యమవుతోంది. చిన్నారులకు ఆట పాటలతో కూడిన ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అధికారుల నిర్లక్ష్యంతో దుబ్బాక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో సరిగా అందడం లేదు.

    దుబ్బాక సెక్టార్‌ పరిధిలో 27 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ఏడుగురు అంగన్‌వాడీ కార్యకర్తలు తప్ప 20 మంది విధులకు ఎగనామం పెట్టి నల్లగొండ జిల్లాలో జరిగే సూపర్‌వైజర్‌ కూతురు బారసాలకు వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఇన్‌చార్జి సీడీపీఓ హేమలత దుబ్బాక, చేర్వాపూర్‌లోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డుమ్మా విషయం బయటపడింది.

    ఐసీడీఎస్‌ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా  ఒకే రోజు సెలవు పెట్టిన 20 మంది కార్యకర్తలపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీడీపీఓ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మరిన్ని వార్తలు