సెటిల్‌మెంట్‌ పేరుతో అన్యాయం

9 Sep, 2017 11:28 IST|Sakshi
తహసీల్దార్‌ ముంజం సోముకు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీ టీచర్లు

నార్నూర్‌ తహసీల్‌ కార్యాలయం ఎదుట
అంగన్‌వాడీ టీచర్ల నిరసన


నార్నూర్‌(ఆసిఫాబాద్‌): 60 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.60వేలు, హెల్పర్లకు రూ.30వేలు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తామని, రేషన్‌ షాపు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌ యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు జాదవ్‌ రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లు శుక్రవారం స్థానిక తహసీల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ ముంజం సోముకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జాదవ్‌ రాజేందర్‌ మాట్లాడుతూ 1975 అక్టోబర్‌ ఐసీడీఎస్‌ ప్రారంభమై ఇప్పటికి 40 ఏళ్లు దాటిందన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు సేవలందించిన అంగన్‌వాడీ టీచర్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో అన్యాయం చేయడం తగదన్నారు. పని కాలాన్ని బట్టి సంవత్సరానికి 15 రోజులు వేతనం లెక్కకట్టి ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం అంగన్‌వాడీలకు రూ, 2 నుంచి రూ.3 లక్షలు, హెల్పర్లకు లక్ష నుంచి 2 లక్షలు వస్తాయని అన్నారు. ప్రతి నెల చెల్లించే వేతనంలో సగం పెన్షన్‌గా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు పుండలిక్, మండల అధ్యక్షరాలు పంచశీల, అంగన్‌వాడీలు అర్కల, ధనలక్ష్మి, రంజన, ప్రమీల, సంగీత ఉన్నారు. 

మరిన్ని వార్తలు