కదంతొక్కిన అంగన్‌వాడీలు

24 Apr, 2017 23:29 IST|Sakshi
కదంతొక్కిన అంగన్‌వాడీలు
అనంతపురం అర్బన్‌ : అంగన్‌వాడీలు తమ సమస్యలపై కదం తొక్కారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. బి.కె.ఉషారాణి అధ్యక్షతన జరిగిన ఆందోళనకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాలకూ ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా వేసవి సెలవులు వర్తింపజేయాలన్నారు.

కేంద్రాల అద్దెలు, టీఏ, డీఏ, కూరగాయలు, గ్యాస్‌కు సంబంధించిన డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు వేతనం రూ.10,500, హెల్పర్లకు రూ.6,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీ వర్కర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష ఇవ్వడంతోపాటు, ఆఖరి నెల వేతనంలో సగం మొత్తం పెన్షన్‌గా ఇవ్వాలన్నారు. చనిపోయిన వారికి బీమా డబ్బు చెల్లించాలన్నారు. అంగన్‌వాడీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ జి.వీరపాండియన్‌కి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, శ్రామిక మహిళ కన్వీనర్‌ దిల్షాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్‌.వెంకటేశ్, అంగన్‌వాడీ సంఘం నాయకురాళ్లు నక్షత్ర, నాగేశ్వరమ్మ, శ్యామల, సత్యలక్ష్మి, శకుంతలమ్మ, కళావతి, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు