కనులపండువగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం

14 Dec, 2016 00:30 IST|Sakshi

మడకశిర రూరల్‌: మండల పరిధిలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లేడుగుంటలో ఆంజినేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వార్ల ఉత్సవ  విగ్రహాలను భక్తులు గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ఉంచి హోమం, విశేష పూజలు జరిపారు.

మధ్యాహ్నం వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈఓ శ్రీనివాసులు, సర్పంచుల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవానంద్, ఎస్‌ఐ మక్భూల్‌బాషా సిబ్బందితో గట్టిపోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఈఓ శ్రీనివాసులు, సర్పంచులు మహేశ్వర్‌రెడ్డి, భీమప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మరథోత్సవంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని రథాన్ని లాగారు.

 

 

మరిన్ని వార్తలు