ఎవరికో అన్న‘వరం’

10 Jun, 2017 00:01 IST|Sakshi
ఎవరికో అన్న‘వరం’
సత్తెన్న సన్నిధిలో  రాజకీయం
- ఖాళీ అయిన ఈవో పోస్టుపై 
  రత్నగిరిపై తమ్ముళ్ల పోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అన్నవరం సత్యదేవుని కొండపై రాజకీయ పాచికలు అడుకుంటున్నారు. ఖాళీ అయిన ఈఓ పోస్టు కోసం అధికార పార్టీలో రెండు గ్రూపులు సిగపట్లు పడుతుండటంతో రత్నగిరిపై రాజకీయం రాజుకుంది. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న అన్నవరం సత్యదేవుని వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఏటా 80 లక్షల మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. స్వామి సన్నిధిలో జరిగే వ్రతాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అటువంటి సత్యదేవుని కొండపై పట్టు కోసం నేతలు హోరాహోరీగా తలపడుతూ రాజకీయం చేస్తున్నారు. సత్యదేవుని ఆలయ కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా గురువారం బదిలీ కావడంతో పోరు తీవ్రమైంది. నాగేశ్వరర రావు స్థానంలో కొత్త ఈవో కోసం రెండు గ్రూపులు రెండు పేర్లను తెరమీదకు తేవడంతో కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. అర్హతలేకున్నా అందలాలెక్కించడం, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేయడం, లక్షల రూపాయలు చేతులు మారితేనే కానీ పోస్టింగుల రాని పరిస్థితులు దేవాదాయశాఖలో ఇటీవల శృతిమించి పోయిన వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 ఈఓ పోస్టింగులకే రూ.20 నుంచి రూ.30 లక్షలు ముట్టజెప్పితే ఇక అన్నవరం సత్యదేవుని ఈఓ పోస్టింగ్‌ అంటే మాటలా అంటున్నారు. ఆ పోస్టింగ్‌కు ఎంత పలుకుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
 ప్రయత్నాల్లో ముగ్గురు...
అన్నవరం ఈఓ పోస్టింగ్‌ కోసం ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈవో మంచెనపల్లి రఘునా«థ్‌, ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినా«ధరావు, రాజమహేంద్రవరం ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ అజాద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు మినహా ఇద్దరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నాగేశ్వరరావు అన్నవరం ఈవోగా వచ్చే సమయంలో రఘునా«థ్‌ కూడా ఇక్కడకు రావడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సోదరుడు ఈయన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా చివరకు దేవాదాయశాఖకు సంబధంలేని రెవెన్యూ శాఖ నుంచి స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ స్థాయి అధికారి అయిన నాగేశ్వరరావుకు పోస్టింగ్‌ దక్కింది. ఈ పోస్టింగ్‌ కోసం అప్పట్లో మంత్రి వర్గీయులు ఒక ఈవో నుంచి తీసుకున్న రూ.20 లక్షలు సంబంధిత వ్యక్తికి ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదంగా మారింది. ఆ సొమ్ములు ఎలానూ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా ఆ పోస్టింగ్‌ అవకాశం దక్కేలా చూడాలని సంబంధిత వ్యక్తి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
ఏసీబికి చిక్కడంతో...
ఇక్కడకు వస్తారని ప్రచారం జరుగుతున్న రఘునా«థ్‌ 2006 నుంచి 2008 వరకు అన్నవరం ఈవోగా పని చేశారు. ఆ సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయడంతో సస్పెండయ్యారు. ఆ కారణంగానే రెండేళ్ల కిందట తిరిగి అన్నవరం ఈవోగా రావాలనే ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఆ ఏసీబీ కేసులో క్లీన్‌చిట్‌ రావడంతో ఇప్పుడు ఇక్కడకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోను రఘునా«థ్‌ను తీసుకువచ్చి తీరతామని మంత్రి అనుచరులు చాలా నమ్మకంగా చెబుతున్నారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. రఘునా«థ్‌ వస్తే కొండపై  తమకు ఇబ్బందులు తప్పవని ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ ఇంజినీరింగ్‌ అధికారి, మరో ఏసీ ఇక్కడి పోస్టింగ్‌ కోసం ఆసక్తి కనబరుస్తున్న ద్వారకా తిరుమల ఈవో వేండ్ర త్రినాథరావు లైన్‌లో పెడుతున్నారు. త్రినా«థరావు జిల్లాలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కొండపై అన్నీ తామే అన్నట్టు చక్రం తిప్పిన ఆ ఇద్దరు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆయన ఈవోగా రావడం ఖాయమని ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. ఇందుకు మంత్రి వర్గీయులతో పొసగని మెట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉన్నత స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నమ్మకమైన వర్గాల ద్వారా తెలిసింది. ఈవో నాగేశ్వరరావు ముక్కుసూటిగా పోయే విధానంనచ్చని వారు ఇప్పుడు కొండపై తమ మాట వినే వారిని తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఇలా రెండు గ్రూపులు చెరొకరి కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా రాజకీయ సిఫార్సులతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరం ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ వైపు దేవాదాయశాఖ కమిషనరేట్‌ వర్గాలు మొగ్గు చూపుతున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో కొండపై మంత్రి, ఎమ్మెల్యేలలో ఎవరి మాట చెల్లుబాటవుతుందో ఎవరు పట్టు సాధిస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
మరిన్ని వార్తలు