ప్చ్‌.. కరుణ చూపలేదు!

9 Jul, 2017 23:06 IST|Sakshi
ప్చ్‌.. కరుణ చూపలేదు!
- రూ.200 వ్రతాల భక్తులను కరుణించని పాలక మండలి
- క్యూ లైన్‌పై షెల్టర్‌ నిర్ణయం వాయిదా
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని సన్నిధిలో రూ.200 వ్రతాల భక్తులపై అన్నవరం దేవస్థానం పాలక మండలి కరుణ చూపలేదు. క్యూలో నిలబడే ఈ వ్రతాల భక్తులకు నీడ కల్పించేందుకుగాను షెల్టర్‌ నిర్మించేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు చేసిన ప్రతిపాదనలను మరో నెల వాయిదా వేసింది. ప్రకాష్‌ సదన్‌ సత్రంలోని సమావేశ మందిరంలో చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం పాలక మండలి సమావేశం జరిగింది. సభ్యులతోపాటు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సత్యగిరిపై సభ్యులు మొక్కలు నాటారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
ముఖ్య తీర్మానాలివీ..
- దేవస్థానంలో నామినేషన్‌ పద్ధతిపై నామమాత్రపు అద్దెకు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న 14 కాఫీ, టీ విక్రయ పాయింట్లను ఇకపై టెండర్‌ కం బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇవ్వాలి.
- సత్యదేవుని ప్రసాదం తయారీకి రూ.49 లక్షలతో కొత్త ఇత్తడి కళాయిలు కొనుగోలు చేయాలి.
- యంత్రాలయంలో యంత్రం వద్ద శాస్త్ర విరుద్ధంగా పాత ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాన్ని తొలగించి, దానిస్థానంలో నూనె దీపాలు ఏర్పాటు చేయాలి.
- దేవస్థానం స్టాఫ్‌ క్వార్టర్లకు పెయింటింగ్‌, పశ్చిమ రాజగోపురం వద్ద ఫ్లోరింగ్‌ పనులు చేయాలి.
- స్వామివారి నిత్యకల్యాణం మండపానికి రూ.5 లక్షలతో రంగులు వేయాలి.
- రెండు టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీకి ప్రతిపాదనలు రూపొందించాలి.
- రూ.1,500, రూ.2 వేల వ్రత మండపాల్లో రూ.4.15 లక్షలతో అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి.
- హరిహరసదన్‌ సత్రం ముందు వివాహాలు చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాన్ని ఇకపై అద్దెకు ఇవ్వకూడదు.
షెల్టర్‌ నిర్మించేదెప్పుడో!
దేవస్థానంలో జరిగే వ్రతాల్లో సగానికి పైగా రూ.200 వ్రతాలే ఉంటాయి. వీటిని ఆచరించేవారిలో ఎక్కువమంది పేద, మధ్యతరగతివారే. గత ఏడాది రూ.200 వ్రతాలే మూడు లక్షలు జరిగాయి. ఇన్ని వ్రతాలు జరుగుతున్నా వీటి నిర్వహణకు మూడు మండపాలే ఉన్నాయి. బ్యాచ్‌కు 200 మంది మాత్రమే ఈ మండపాల్లో వ్రతాలాచరించే వీలుంటుంది. ఇందుకోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉంటోంది. ఎండొచ్చినా, వానొచ్చినా క్యూలో తడవాల్సిందే. వారి కష్టాలపై ‘వ్రతాలు రూ.200.. ఇబ్బందులు వేయింతలు’ శీర్షికన గత నెల 27వ తేదీన సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన అధికారులు.. రూ.200 వ్రతాలాచరించే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా షెల్టర్‌ నిర్మించేందుకు సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. అయితే దీనిని పాలక మండలి వచ్చే సమావేశానికి వాయిదా వేసింది. ఈ షెల్టర్‌ నిర్మాణానికి వెంటనే టెండర్‌ పిలిచినా పనులు ప్రారంభించడానికి కనీసం నెల పడుతుంది. పని పూర్తి కావడానికి మరో నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని పాలక మండలి మరో నెల వాయిదా వేయడంతో ఇప్పట్లో ఈ పనులు జరిగే అవకాశాలు లేవు. ఫలితంగా రూ.200 వ్రతాల భక్తుల ఇబ్బందులు కూడా ఇప్పుడప్పుడే తొలగే పరిస్థితి కానరావడంలేదు. పాలక మండలి సభ్యులు ఈ వ్రత మండపాలను ఈ నెల 25న పరిశీలించి షెల్టర్‌ అవసరమా, కాదా అనే దానిపై ఒక నిర్ధారణకు వస్తామన్నారని, అందువల్లనే ఈ అంశాన్ని వాయిదా వేశామని ఈఓ జగన్నాథరావు ‘సాక్షి’కి తెలిపారు.
మరిన్ని వార్తలు