రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ

5 Jun, 2017 22:53 IST|Sakshi
రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ
స్వామిని దర్శించిన 40 వేలమంది భక్తులు
ఎండ వేడి తట్టుకోలేక భక్తుల ఇబ్బందులు
అన్నవరం(ప్రత్తిపాడు) : ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రత్నగిరి శ్రీసత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం 40 డిగ్రీల పైబడి ఎండ కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల నుంచి నేల వేడెక్కి కాళ్లు కాలిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి స్వామివారి ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది.  
సత్యదేవుని వ్రతమాచరించిన చిన రాజప్ప, రెడ్డి సుభ్రహ్మణ్యం:
డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, శానసమండలి డిప్యూటీ  చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఏసీ మండపంలో వ్రతాలకు డిమాండ్‌:
ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్రతాలాచరించే భక్తులు రూ.2,000 టికెట్‌తో ఏసీ వ్రతమండపంలో వ్రతాలాచరించేందుకు మొగ్గు చూపారు. సాధారణంగా ప్రతి రోజూ వంద వ్రతాల వరకూ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అటువంటిది సోమవారం రెండు వందలకు పైగా ఈ వ్రతాలు జరిగాయి.
స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు:
సుమారు 40 వేలమంది భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి వ్రతాలు 3,611 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 
>
మరిన్ని వార్తలు